How many species of trees are there in the world?

💥ప్రపంచంలో మొత్తం వృక్ష జాతులు ఎన్ని ఉంటాయి ?




ప్రపంచంలో వృక్షజాతుల సంఖ్య మీద అంచనాలు ఎప్పటి కప్పుడు తారుమారు అవుతున్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు రెండువేల రకాల కొత్త వృక్షజాతులను కనుక్కోవడం, మొక్కల సేకరణలో, లెక్కించడంలో కంప్యూటర్లను ఉవయోగించడం దీనికి కారణాలుగా పరిశోధకులు భావిస్తున్నారు. 


1992లో రాయల్ సొసైటీ అధ్యక్షుడైన లార్డ్ మే రెండు లక్షల 70 వేల వృక్షజాతులు ఉన్నాయని అంచనా వేసారు. దశాబ్దకాలం నాటికి, 2002లో బ్రిటన్‌కు చెందిన డేవిడ్ బ్రామ్ వెల్ (వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ సభ్యులు), రాఫెల్ గ్రోవర్స్ (రాయల్ బొటానికల్ గార్డెన్స్ లో సైంటిఫిక్ ఆఫీసర్)లు మొత్తం పదిలక్షల వృక్షజాతులను సేకరించారు. 


అయితే, ఒకే రకం మొక్కలను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లుతో పిలవడం వీరు గమనించారు. ఈ తరహావి సుమారు ఆరు లక్షల వృక్షజాతులు ఉన్నాయి. వీటిని మినహాయించగా 2003 నాటికి 4 లక్షల 21 వేల 968 వృక్ష జాతులు ఉన్నాయని తేలింది. 


భవిష్యత్తులో జరిగే పరిశోధనలతో వీటి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుంది.


స్థూలంగా చెప్పాలంటే ఐరోపా, మధ్యధరా ప్రాంతంలో 19,236; ఉష్ణమండల పశ్చిమ ఆఫ్రికాలో 10,340; తూర్పు ఆఫ్రికాలో 7,850; సమశీతోష్ణమండల ఆసియాలో 61,680 దక్షిణాఫ్రికాలో 23,000; ఉష్ణమండల ఆసియాలో 79,500; ఉష్ణమండల మధ్య ఆఫ్రికాలో 16,032; దక్షిణ అమెరికాలో 98,800; ఉత్తర అమెరికాలో 23, 150; మధ్య అమెరికాలో 7,380 వృక్షజాతులు ఉన్నాయని తేలింది. -


💥వృక్షాలు ఎన్ని రకాలు ?


- వృక్షాలను రెండు రకాలుగా విభజించారు. 1. పుష్పించని మొక్కలు వీటిలో పుష్పాలు ఏర్పడవు. 2. పుష్పించే మొక్కలు - వీటిలో పుష్పాలు ఏర్పడతాయి. పుష్పించని మొక్కల (క్రిష్ణోగ్రామ్స్)లో పుష్పాలు ఏర్పడవు. నిజానికి పుష్పాలు మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తికి ఉపయోగవడే అవయవాలు.


 కాని పుష్పించని మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి పుష్పాల ద్వారా కాకుండా సంయోగబీజాలు (గామేట్స్) అనే కణాల ద్వారా జరుగుతుంది.

పుష్పించని మొక్కలను తిరిగి మూడు తరగతులుగా విభజించారు.

 1. థాలో ఫైటా ప్రాథమిక మొక్కలు. వీటి దేహం థాలస్ మాదిరిగా ఉంటుంది. కాండం, వేర్లు, పత్రం అనే భాగాలుగా విచ్ఛేదనం చెందని మొక్క దేహాన్ని థాలస్ అంటారు.


 2. బ్రయోఫైటా వీటిని మాస్ మొక్కలు అంటారు. తడినేలల్లో పెరుగుతాయి. (ఉదాహరణలు : రిక్సియా, ప్యునేరియా). 


3. టెరిడోఫైటా - వీటిని ' ఫెర్న్ ' లు అంటారు. అలంకరణ కొరకు వీటిని కుండీలలో పెంచుతారు. (ఉదాహరణలు : మార్సీలియా, అజూల్లా).


💥మొక్కల ఆకులు ఆకుపచ్చగా ఉన్నప్పటికి, వాటికి పుట్టిన పుష్పాలు మాత్రం రంగులలో వుండటానికి కారణమేమిటి ?


- పత్రహరితం (క్లోరోఫిన్) వుండటం వలన ఆకులు ఆకుపచ్చగా ఉంటాయి. గదా! ఆకుకు ఆహార పదార్థాలను కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారుచేయడానికి ఆకులోని ఆకుపచ్చ రంగును ఏమాత్రం ఉపయోగించుకోదు.


 సూర్యకాంతిని గాలిలోని కార్బన్ డై యాక్సైడు, మొక్క వేళ్ళ ద్వారా ఆకుల్లోకి చేరిన నీటి ఆవిరిని మేళవించడం ద్వారానే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ ద్వారా మొక్కకు ఆవసరమైన ఆహారం రూపొందుతుంది. మొక్కకు కలిగిన పువ్వులు మాత్రం ఈ ప్రక్రియలో పాల్గొనవు. 


మొగ్గగా ఉన్నప్పుడే పువ్వు రేకలలో రకరకాల రంగులు (పిగ్మెంట్స్ రూపంలో) ఉండటంతో ఆయా మొక్కలను అనుసరించి వివిధ రూపాల్లో, రంగులలో మొగ్గలు పువ్వుల రూపాన్ని సంతరించుకుంటాయి.


💥మొక్కలలో రకరకాల తేడాలు ఎందుకు వున్నాయి ?


ఒకే జాతికి చెందిన మొక్కల్లో కూడా అనేక తేడాలు వుంటాయి. ఉదాహరణకు వరి, జొన్న, రాగి మొదలైన వృక్షశాస్త్ర పరంగా చూస్తే గడ్డి జాతికి చెందినవి. అయితే, వరిని మినహాయించి మిగిలిన వాటిని అతి తక్కువ నీటితోనే పండించవచ్చు. 


వరికి మాత్రం ఎక్కువ మొత్తంలో నీరు అవసరమవుతుంది. 'కొర్రలు' అనే రకం వరిని మాత్రం తక్కువ నీటి తోనే పండించవచ్చు. ఇందుకు కారణమేమిటంటే కాలక్రమంలో వరి మొక్క వాతావరణ పరిస్థితులకు తగిన విధంగా అధిక నీటి వాడకానికి అలవాటు పడటమే. 


వివిధ మొక్కల భిన్న భిన్న వ్యత్యాసాలు కలిగివుండటానికి ప్రధాన కారణం జన్యుపరిభాషలో అడాప్టేషన్ (Adaptation) మాత్రమే. ప్రజజనం (Breeding), జన్యు ఆధారిత పరిజ్ఞానం (Functional Genomics), మొక్కల క్రియాత్మక ధర్మాలు (Crop Physiology). 

ఈ మూడూ మొక్కల తీరుతెన్నులను నిర్దేశిస్తాయి. పరిశోధనలు వీటి ఆధారంగానే జరుగుతుంటాయి. కొత్త వంగడాల సృష్టికి సైతం ఈ మూడింటి ఆధారమే ఉంటుంది.


💥పనసకాయలు చెట్టు మానుకే కాయడానికి గల కారణమేమిటి ? 


 కొమ్మ, రెమ్మ, దానికి పూత, పిందె, కాయ ఇది ప్రకృతి సహజం. పనసపండు (Jack Fruit) చెట్టుకు గల బాగా ఎదిగిన మానుకు కాస్తుంది. 

ఆడ పుష్పాలు (పూత) మాను మీద/ బాగా ఎదిగిన కొమ్మల మీద పూయడం జరుగుతుంది. వృక్షాలు అందించే పండ్లలో చాలా బరువుండే పండు ఇదే. దాదాపు 35 కిలోల బరువు వుండగలదు. 


ఇంతటి బరువును మోయాలంటే మానుకే సాధ్యం. మరో ఉదాహరణ ఆగ్నేయాసియాలో డ్యూరియన్ చెట్టుకూడా నాలుగు కిలోల బరువుండే పండ్లను కాస్తుంది. పనసచెట్లు, డ్యూరియన్ చెట్లు బాగా మందమైన మాను నుంచే గుత్తులుగుత్తులుగా పూత, పిందెలు ఏర్పడతాయి. 


పనసచెట్టుకు మగ, ఆడ పుష్పాలు విడివిడిగా వుంటాయి. మగ పుష్పాలు కొత్తగా ఎదుగుతున్న ఆకులలో ఆడపుష్పాలకు ఎగువున కనిపిస్తాయి. 


ఆడపుష్పాలు పొట్టిగా, లావైన మొగ్గలతో మానును ఆధారం చేసుకుని కన్పిస్తాయి. ఇటీవలి కాలంలో (2007, మే నెల) మామిడి కూడా మాను మీదనే కాయలు కాసాయి. 

కావలి మండలం సిరిపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. తెగులు ఎండిపోయిన మామిడి చెట్ల కొమ్మలను నరికివేయగా, వాటిలో ఒక చెట్టు కొమ్మకు చిగురులేకుండానే కాయలు కాశాయి.