Ramprasad bismil & ashfakhulla Khan || Indian historyఆంగ్లేయులచే 1927 డిసెంబర్ 19 న ఉరితీయబడిన " పండిత రాంప్రసాద్ బిస్మిల్ - అష్ఫాఖుల్లాహ్ ఖాన్ " ల స్మరణలో ...

====

అపూర్వం - ఆదర్శనీయం  

" పండిత రాంప్రసాద్ బిస్మిల్ - అష్ఫాఖుల్లాహ్ ఖాన్ " ల స్నేహబంధo.

భారత జాతీయోద్యమ చరిత్రలోని 'అగ్నియుగం' నాటి విప్లవ పోరాటయోధులు రాంప్రసాద్‌ బిస్మిల్‌, అష్ఫాఖుల్లా ఖాన్‌ల మధ్య ఏర్పడిన స్నేహబంధం ఎంతో త్యాగపూరితమైంది. రాంప్రసాద్‌ బిస్మల్‌ 'హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌' నాయకుడు. అష్ఫాఖ్‌ ఖాన్‌ బిస్మిల్‌ ఆయన సహచరుడు. అష్ఫాఖ్‌ ఇస్లాం ధర్మానురక్తుడు. మతం మారిని వారిని శుద్ధి కార్యక్రమం ద్వారా తిరిగి హిందూ మతంలోకి ఆహ్వానించే కార్యక్రమాలను చురుగ్గా నిర్వహిస్తున్న వ్యక్తి రాంప్రసాద్‌ బిస్మిల్‌ అర్యసమాజీకుడు. మత ధర్మాలను బట్టి అష్ఫాక్‌-బిస్మిల్‌ల ధార్మిక బాటలు వేర్వేరుగా ఉన్నా బ్రిటీష్‌ పాలకుల కబంద హస్తాల నుండి మాతృభూమిని విముక్తం చేయాలన్న తిరుగులేని వారి సంకల్పం ఆ ఇరువురి బాటను ఏకం చేసింది. ఆ విధంగా ఏర్పడిన వారిరువురి స్నేహబంధం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అద్వితీయంగా వెలుగొంది ఆనాటికి - ఈనాటికి ఆదర్శనీయంగా నిలచింది.  

ఈ స్నేహబంధం ఆనాడు ఎంత సంచలనం సృష్టించిందో, ఈ యోధుల గురించి బంధుమిత్రులు ఏమనుకున్నారో బిస్మిల్‌ స్వయంగా తన ఆత్మకథలో, 'ఒక పచ్చి ఆర్యసమాజికునికి, ఒక ముస్లిముకు మధ్య యిలా స్నేహం ఎలా కలిసింది? అని అంతా ముక్కుపై వేలేసుకునే వాళ్ళు. నేను ముహమ్మదీయులను శుద్ధి (హిందువులుగా మార్పిడి) చేస్తుండేవాడిని. ఆర్యసమాజ మందిరంలోనే నా నివాసం ఉండేది. కాని నీవీ విషయాలను వేటినీ కించిత్తయినా లేక్కచేయలేదు. నీవు ముహమ్మదీయుడివి కావడం చేత నా మిత్రులు కొందరు నిన్ను తిరస్కారభావంతో చూస్తుండేవారు. కానీ నీవు ధృఢ నిశ్చయంతో నిలిచావు. నన్ను కలుసుకోవడానికి నీవు ఆర్యసమాజ మందిరానికి వచ్చిపోతుండేవాడివి. హిందూ-ముస్లింల కలహాలు చెల రేగినప్పుడు విూ పేటలో అందరూ నిన్ను బాహటంగా దూషించేవారు. కానీ నీ వెప్పుడూ వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించలేదు', అని రాసుకున్నాడు.

మాతృభూమి విముక్తికి సంబంధించిన అంశం ప్రధాన మైనప్పుడు హిందువైనా, ముస్లిమైనా ఒకే రకంగా స్పందిస్తారని, ఒకే రకంగా త్యాగాలకు సిద్ధపడతారని, ఈ సంసిద్ధత, త్యాగాలకు మతం ఏమాత్రం అడ్డంకి కానేరదని అష్ఫాఖ్‌ తన అపూర్వర నిబద్ధతతో, అకుంఠిత దీక్షతో సాక్ష్యం పలికారు. 'చివరకు హిందువులు ముస్లిం లలో ఏదో తేడా ఉందనే ఆలోచనే నా హృదయం నుండి నిష్క్రమించ సాగింది. నీవు నా విూద ప్రగాఢ విశ్వాసం, అమిత ప్రీతి కలిగి ఉండే వాడివి', అని సనాతన సంప్రదాయానురక్తుడు, శుద్ధి సంఘం నేత రాంప్రసాద్‌ బిస్మిల్‌ స్వయంగా అష్ఫాఖుల్లా గురించి రాసుకున్నారు.

ఈ అపూర్వ స్నేహం రాంప్రసాద్‌ బిస్మిల్‌ కోసం ప్రాణత్యాగానికి కూడా అష్ఫాఖుల్లాను పురికొల్పింది. జాతీయోద్యమ చరిత్రలో ఉత్తేజ పూరితమైన 'కాకోరి రైలు సంఘటన' బిస్మిల్‌ నాయకత్వంలో జరిగింది. ఈ సంఘటనలో పాల్గొనడం అష్ఫాఖుల్లా ఖాన్‌కు ఇష్టం లేదు. బాల్య థలో ఉన్న విప్లవోద్యమానికి ఇది గొడ్డలిపెట్టు కాగలదని ఆయన తన సహచరులకు, నాయకుడు బిస్మిల్‌కు నచ్చచెప్పేందుకు విఫల ప్రయత్నం చేశాడు. అత్యధికుల అభిప్రాయాన్ని గౌరవించే ప్రజాస్వామిక వాది అఫ్ఫాఖుల్లా చివరకు ఉమ్మడి నిర్ణయాన్ని అంగీకరించక తప్పలేదు. ఆ తరువాత జరిగిన కాకొరి రైలు సంఘటనలో ఆయన ప్రధాన పాత్రవహించాడు.ఈ సంఘటనలో పాల్గొన్న వారిలో అష్ఫాఖుల్లా తప్ప మిగిలిన వారంతా వెంటనే పోలీసులకు పట్టుబడగా, ఆఫ్ఫాఖ్‌ మాత్రం బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని ముప్పుతిప్పలు పెట్టి చాలా కాలం తరువాత అరెస్టు అయ్యాడు. అపాటికి ఈ కేసులో విప్లవకారుందరికి కఠిన శిక్షలను విధిస్తూ తీర్పులు వెలువడ్డాయి. ఆ తరువాత అందరి అప్పీళ్ళ తిరస్కరించబడి, పలు రకాల శిక్షలు ఖరారయ్యాయి. లండన్‌ లోని ప్రీవీకౌన్సిల్‌కు అప్పీలు చేసుకోవడం మాత్రమే చివరకు మిగిలింది. 

 ఆ థలో అరెస్టయిన అష్ఫాఖుల్లా ఖాన్‌ తన ఆప్తమిత్రుడు, 'హిందూస్థాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌' నాయకుడు రాంప్రసాద్‌ బిస్మిల్‌ను ఉరిశిక్ష నుండి తప్పించ బూనుకున్నాడు. న్యాయవాదులతో సంప్రదించాడు. మిత్రుడితో మాట్లాడాడు. చివరకు నేరాన్ని మొత్తంగా తాను స్వీకరిస్తే బిస్మిల్‌ను కాపాడవచ్చని అభిప్రాయానికి వచ్చాడు. మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న విప్లవకారులు ప్రాణాలు కాపాడుకోవడం కోసం అప్పీలు చేసుకోవడం, క్షమాబిక్ష యాచించడం సరికాదన్నది అష్ఫాఖ్‌ అభిప్రాయం.ప్రీవీకౌన్సిల్‌కు అప్పీలు చేయడం అష్ఫాక్‌కు ఇష్టం లేకున్నా స్నేహితుడు బిస్మిల్‌ కోరిక మేరకు సరేనన్నాడు.

ఆ మేరకు కాకోరి రైలు సంఘటనకు తానే పూర్తిగా బాధ్యుడనని వివరిస్తూ, నేరాన్ని మొత్తాన్ని తన నెత్తిన వేసుకుంటూ ప్రీవికౌన్సిల్‌కు సమర్పించేందుకు అష్ఫాఖుల్లా ఖాన్‌ ప్రకటన పత్రం తయారు చేశాడు. ఆ అభ్యర్థన పత్రం చూసిన ఆయన న్యాయవాది కృపాశంకర్‌ హజేలా కంగారు పడిపోతూ ఆ విధంగా ప్రకటన చేసినట్టయితే ఆయనకు ఉరిశిక్ష ఖాయమని హెచ్చరించినా అష్ఫాఖ్‌ వినలేదు. మిత్రుడు, విప్లవోద్యమ నేత బిస్మిల్‌ కోసం బలికావడానికి సిద్ధపడిన ఆయన న్యాయవాది కృపాశంకర్‌ హెచ్చరికలను ఖాతరు చేయకుండా ఆ వినతి పత్రాన్ని నేరుగా ప్రీవీకౌన్సిల్‌కు పంపుతూ, చారిత్రాత్మక కాకోరి రైలు సంఘటన నేరభారాన్ని, ఆ నేర బాధ్యతను పూర్తిగా తాను స్వీకరిస్తూ ఒప్పుకోలు ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా తన న్యాయవాదికి మరింత వివరణ ఇస్తూ, 'ఈ మార్గం కంటక ప్రాయమైనప్పటికి, ఈనాడు దేశం కోసం ప్రాణాలు అర్పించాల్సిన పరిస్థితి చాలా ఉంది. ఇక నేరం అంగీ కరించటం అంటారా? నా వరకు నేను నేరం అంగీకరించడానికి సిద్ధమే కాదు, అందరి నేరాలను నా నెత్తిన వేసుకోడానికి కూడా సిద్ధం,' అని కాకోరి రైలు సంఘటన నేరభారాన్నీ పూర్తిగా అష్ఫాఖుల్లా ఖాన్‌ తన నెత్తిన వేసుకున్నాడు.

ఆ నేర ఒప్పుకోలు పత్రం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన న్యాయవాది కృపాశంకర్‌ హజేలాతో అష్ఫాఖ్‌ మాట్లాడుతూ మిత్రుడి మంచిని సర్వదా కోరుకునే స్నేహితుడిగా, నాయకుడి క్షేమాన్ని నిరంతరం ఆకాంక్షించే కార్యకర్తగా, విప్లవోద్యమం పట్ల నిజాయితి, నిబద్దత గల విప్లవకారుడిగా, వలస పాలకుల నుండి మాతృభూమి విముక్తి కోసం పోరాడుతున్న స్వాతంత్య్ర సమరయోధుడిగా అఫ్ఫాఖ్‌ పలికిన పలుకులు ఈనాటికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. 

అష్ఫాఖుల్లా ఖాన్‌ తన న్యాయవాదితో మాట్లాడుతూ, 'నేను ఎల్లప్పుడు సిపాయిని మాత్రమే. శ్రీ రాంప్రసాద్‌ బిస్మిల్‌ మా నాయకుడు. ఆయన నిష్టగల దేశభక్తుడు. మంచి తెలివితేటలు గల వ్యక్తి. నా ప్రాణాలు ఆడ్డువేసి ఆయనను రక్షించుకోగలిగితే అది మా పార్టీకి, మా లక్ష్యాల సాధనకు ఎంతో మంచిదౌతుంది. నేను సిపాయిని మాత్రమే. ఆయన ఆలోచనలు తీరుతెన్నుల విషయంలో నేను ఆయనతో సరితూగలేను. ఆందువలన ఆయనను రక్షించుకోవాల్సి ఉంది ... భారత జాతీయ కాంగ్రెస్‌ ఎలాగైతే లక్ష్యసాధనకు తన మార్గాన్ని నిర్దేశించుకుందో అలాగే మేమూ దేశ స్వాతంత్య్రం కోసం మా మార్గాన్ని ఏర్పచు కున్నాం. అని అన్నాడు.

అష్ఫాఖుల్లా ఖాన్‌ నిర్బంధంలో ఉన్నప్పుడు మతం ఆసరాతో అతడ్ని తమవైపు తిప్పుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు ఎన్నో విధాలుగా మభ్యపెట్టారు. 'రాంప్రసాద్‌ బిస్మిల్‌ ఒక హిందువు. ఆర్య సమాజీకుడు. దేశంలో హిందూ రాజ్యం నెలకొల్పడం వాళ్ళ ధ్యేయం. అది ముస్లింల ప్రయోజనాలకు పూర్తిగా విరుద్దమైనది. ఒక ముస్లింగా నీవు వారి మతతత్వాన్ని నిరసించి, ప్రభుత్వంతో సహకరించు, కాఫిర్లతో సహకరించడం మన మత సంప్రదాయాలకు పూర్తిగా విరుద్దం కాబట్టి ఒప్పుదల వాంగ్మూలం ఇచ్చి నీ ప్రాణాలను, అలాగే నీ మతం ప్రయోజనాలను కాపాడుకో', అంటూ ఆయనను తమ మార్గంలోకి తెచ్చుకునేందుకు చాలాసార్లు విఫలప్రయత్నాలు చేశారు. 

అష్ఫాఖుల్లాను ఏలాగైనా లొంగదీసుకోవాలనుకున్న ఆ పోలీసు అధికారి మరింత తెలివిగా మాట్లాడుతూ, 'ఇదంతా హిందువుల కుట్ర. రాంప్రసాద్‌ బిస్మిల్‌ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడు. విూరు ముస్లిం అయిఉండి ఎలా మోసపోయారు?' అంటూ మతపరమైన ప్రశ్నలను సంధించాడు. ఆ ప్రశ్న, ఆ ప్రశ్నలోని విభజించి-పాలించు కుతంత్రం, అందులోని కుట్రను గ్రహించిన అష్ఫాఖ్‌ పోలీసు ఆధికారికి సూటిగా సమాధానమిస్తూ, 'రాంప్రసాద్‌ హిందూ రాజ్యం కోసం పోరాడుతున్నాడన్న విషయం అబద్దం. ఒకవేళ అది నిజమైతే, బ్రిటీష్‌ రాజ్యం కంటే హిందూ రాజ్యం మేలు కదా', అని అన్నాడు. అంతటితో ఆగకుండా ఈ కేసులో 'నేనొక్కడినే ముస్లిం కావడంతో నా బాధ్యత మరింత పెరిగింది. నేను ఏదైనా పొరపాటు చేశానా? ఆది ప్రధానంగా ముస్లింల విూద మా పఠాన్‌ జాతి జనుల విూద మాయని మచ్చగా మిగిలి పోతుంది. కనుక నన్ను గౌరవప్రదంగా మరణించనివ్వండి' అని స్పష్టం చేస్తూ అందర్ని ఆశ్చర్యచకితుల్ని చేశాడు, చివరకు ఉరిశిక్షకు సిద్ధమయ్యాడు.  

ఈ విధంగా అష్ఫాఖుల్లా ఖాన్‌ ఆదర్శప్రాయమైన స్నేహ బంధాన్ని, సమరయోధుని ధర్మాన్ని ప్రదర్శించాడు. మహత్తర లక్ష్యాన్ని సాధించేందుకు ఏర్పడిన మిత్రత్వం జాతి, మత, కుల ప్రాంతాలకు అతీతంగా ఉంటుందని ఆచరణాత్మకంగా రుజువు చేశాడు. ఈ ఇరువురిని వారి మిత్రులు, బంధువులు మతభ్రష్ఠులుగా నిందించారు. ఈ సందర్భంగా బిస్మిల్‌ను ఆయన స్నేహితులు హెచ్చరిస్తూ చేసిన వ్యాఖ్యలను బిస్మిల్‌ ప్రస్తావిస్తూ, 'మా బృందంలో తరచూ నీ గురించి చర్చ వచ్చేది. ఏమో నమ్ముతున్నావు ... మోసపోయేవు సుమా అని అనేవాళ్ళు ... కానీ నీవు నెగ్గావు', అని బిస్మిల్‌ అత్మకథలో అష్ఫాఖ్‌లోని నికార్సయిన నిజాయితీని స్వయంగా ప్రకటించాడు. 

ఈ విషయాన్ని బిస్మిల్‌ మరింతతగా సుదృఢంచేస్తూ, 'నేను నీవు అనే తేడా లేకుండా పోయింది మన మధ్య, తరచూ నీవూ నేను ఒకే కంచంలో తిన్నాము', అన్నాడు. చివరివరకు మతాలకు అతీతంగా వ్యవహరించిన అష్ఫాక్‌-బిస్మిల్‌ మిత్రద్వయం మాతృభూమి విముక్తి పోరాటంలో కలసి మెలసి పాల్గొనటం మాత్రమే కాకుండా కంటక ప్రాయమైన ఆ మార్గంలో ఎదురైన అన్ని కష్ట నష్టాలతోపాటు చివరకు ఉరిశిక్షలను కూడా సంతోషంగా స్వీకరించి చిరస్మరణీయులయ్యారు.

చివరి రోజుల్లో కూడా మత ప్రసక్తి లేకుండా భారతీయులంతా కలసిమెలసి ఉండాల్సిందిగా అష్ఫాఖుల్లా ఖాన్‌ ప్రజలను కోరారు. 1927 డిసెంబరు 19న ఆయనను ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాదు జైలులో ఉరి తీస్తారనగా, డిసెంబరు 16న జైలు నుండి దేశవాసులను ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశాడు. 

ఆ లేఖలో, 'భారతదేశ సోదరులారా మీరు ఏ మతానికి, సంప్రదాయానికి చెందిన వారైనా సరే, దేశసేవలో కృషిచేయండి. వృధాగా పరస్పరం కలహించకండి. అన్ని పనులూ ఒకే లక్ష్యాన్ని సాధించేందుకు సాధనాలు. అలాంటప్పుడు ఈ వ్యర్థపు కోట్లాటలూ, కుమ్ములాటలు ఎందుకు? ఐకమత్యంతో దేశంలోని దొరతనాన్ని ఎదిరించండి. దేశాన్ని స్వతంత్రం చేయం ... చివరగా అందరికి నా సలాం. భారతదేశం స్వతంత్రమగుగాక. నా సోదరులు సుఖంగా ఉందురు గాక', అంటూ తన ఆకాంక్షను వ్యక్తంచేస్తూ ఆ అష్ఫాఖుల్లా ఖాన్‌ చారిత్రకమైన లేఖను ముగించాడు.

 మాతృభూమి విముక్తి పోరాటంలో అమరురైన ఆ మహానీయుల పిలుపును మదిలో ఉంచుకుని మతంపేరిట, కులంపేరిట, శాఖల పేరిట మనుషులను విభజించి తన రాజకీయ ప్రయోజనాల సాధన కోసం సతమతమవున్న స్వార్ధపర రాజకీయ, ఆసాంఘిక శక్తులను ప్రజాస్వామ్య పద్దతిలో ఎదుర్కొనేందుకు యువత సిద్దంకావడం మాత్రమే ఆ అమరవీరులకు సరైన నివాళి కాగలదు.