గురునానక్ జీవిత చరిత్ర || About gurunanak life history

 *గురునానక్ చరిత్ర..*


🛕


గురునానక్ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులు ఈ ఏడాది నవంబర్ 27న జరుపుకుంటున్నారు. ఈ గురునానక్ జయంతిని ప్రకాశ్ ఉత్సవ్, గురుపూరబ్ అని కూడా అంటారు. ఆ రోజున సిక్కులు సిక్కు గ్రంథం, 'గురు గ్రంథ్ సాహిబ్' ను నిరంతరం పారాయణం చేస్తారు. పల్లకి ఊరేగింపులో గ్రంథంలోని సారాంశాల ఆధారంగా కవితలు పాడతారు. గ్రంథ్ సాహిబ్ ను ఊరేగింపులతో పూలతో అలంకరించిన రథంలో తీసుకెళతా రు. ఈ పవిత్ర దినం రోజున గ్రంథ్ సాహిబ్ పంక్తులను జపిస్తారు. 


ఈ గురునానక్ జయంతి సిక్కు సమాజానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సిక్కు సమాజానికి 10 మంది గురువులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి గురు పూరబ్ ఉంది. సిక్కు ప్రజల మొదటి గురువు గురునానక్ జన్మదినం సందర్భంగా, సిక్కు మతానికి పునాది వేసిన వ్యక్తి ఆయనే కాబట్టి గురునానక్ జయంతిని ఉత్సాహంతో జరుపుకుంటారు. ఆయన పుట్టినరోజు ప్రతి సంవత్సరం చంద్ర క్యాలెండర్ ను బట్టి మారుతూ ఉంటుంది.


ఈ 2023 సంవత్సరం సిక్కులు 554వ గురునానక్ ప్రకాశ పర్వ దినాన్ని 27 నవంబర్ నాడు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఈ పండుగ జయంతి గురించి, చరిత్ర మరియు ప్రాముఖ్యతతో పాటు గురునానక్ గురిచి ఆసక్తికరమైన విషయాలను ఈ కధలో తెలుసుకుందాం.*గురునానక్ చరిత్ర - 1*


గురునానక్ దేవ్ 1469లో రాయ్ - బోయ్ - డి తల్వాండి అనే గ్రామంలో కార్తీక పౌర్ణమిలో జన్మించారు. ఇది అప్పటి ఢిల్లీ సుల్తానేట్ ప్రావిన్స్. ప్రస్తుతం ఈ ప్రదేశం నన్కన సాహిబ్ అని పిలువబడుతుంది. ఇది ఇప్పుడు పాకిస్థాన్ లోని లాహోర్ సమీపంలో ఉంది. గురునానక్ తల్లిదండ్రులు కళ్యాణ్ చంద్ దాస్ బేడి, వీరిని మెహతా కలు అని కూడా పిలుస్తారు. తల్లి మాతా త్రిప్త.


నానక్ పుట్టగానే పెద్దవారివలె నవ్వినాడని ఆయన తల్లికి పురుడుపోసిన తురక దాది ఇరుగుపొరుగు వారికి తెలియపరచెను. నానక్ జన్మ సమయమున దేవదుందుభులు మొరయగా అందరు వినిరని భక్తులైన చరిత్రకారులు వ్రాసియున్నారు. కుటుంబ జ్యోతిష్కుడైన హరదయాళుడు శిశువును చూచి చేతులు జోడించి నమస్కరించెను. ఈ బిడ్డ పెరిగి పెద్దవాడై రాజలాంఛనములతో హిందువులచే, ముసల్మానులచే సమానము గా ఆరాధించబడగలడని, ప్రకృతిలోని జడ వస్తువులు సైతము ఆయన పేరును గౌరవ ప్రపత్తులతో సంస్మరించగలవని జోస్యము చెప్పెను.


చిన్నతనములో నానక్ హిందూ గురువు వద్ద అక్షరాభ్యాసముచేసిరి. ఆయన వద్ద ప్రాధమిక గ్రంధములు కొన్నింటిని పఠించి ఆ తరువాత మరొక ముస్లిము గురువు వద్ద అరబిక్, పర్ష్యన్ భాషలనభ్యసించెను. సాధారణముగా బడి ఎగవేసి సమీపమున నున్న అడవులకు పోయి అక్కడి పండితుల తో సాధువులతో చర్చలు జరిపి వివిధ మతములకు సంబంధించిన ప్రాధమిక సత్యములను ఎన్నింటినో తెలుసుకొనెను. తనకున్న వ్యవధి నంతయు నిర్గుణ భగవ ధ్యానములో గడిపె డివాడు. ఇది చూచి తన బిడ్డ పెరిగి ప్రయోజకుడు కావలెనని ఎంతగానో ఆశించిన నానక్ తండ్రి భయపడిపోయెను.


నానక్ చిన్ననాటి గాధలెన్నో బహుళ ప్రచారములోనున్నవి. ఒక రోజున గురువు బీజ గణితము నేర్చుకొనవలసినదని నానక్ ను ఆదేశించెను. దానికి జవాబుగా అదే అక్షరమాలతో ఒక్కొక్క అక్షరము అంతరార్ధ మును వివరించుచు పద్యమల్లి వినిపించెను. ప్రతి అక్షరము భగవంతుడొక్కడే ఋజువు పరచుననియు, లేదా ఆయన అద్భుత సృష్టికి నిదర్శనమనియు లేదా భగవంతుని సంస్మరించవలసిన ఆవశ్యకతను నిరూపించు చున్నదనియు ఆయన వివరించెను. అయితే ఈ పద్యమును నానక్ అంత చిన్నతనమున కాక పెరిగి బాగా పెద్దవాడై గురుపదమలంక రించిన పిమ్మట రచించియుండునని కొందరు అభిప్రాయపడుచున్నారు. ఇంత ప్రౌఢమూ, సుందరమూ అయిన గీతమును అంత చిన్న వయస్సులో ఎవ్వరూ అల్లజాలరని వారి అభిప్రాయము. అయితే మనసు వయసుతో పక్వమగునా ?


ఏది ఏమైనప్పటికీ గురునానక్ బడిలో చాలా కాలము చదువలేదనుట నిర్వివాదము. ఆయనకు చదువబ్బి పండితుడగునను ఆశ లేనందున ఆయనకు తండ్రి పసులకాపరి పని అప్పగించెను. అయితే ఈ పనిలో కూడా తండ్రికి ఆశాభంగమే ఎదురయ్యెను.


ఎందుకనగా నానక్ ఒకనాడు పసులను మేపుటకై తోలుకువెళ్లి, ఒక మర్రిచెట్టు నీడను కూర్చొని భగవంతుని ధ్యానించుకొనుచుండె ను. ఆ సమయమున ఆ పసువులు పొరుగు వాని పొలములో జొరబడి యధేచ్ఛగా మేయుచుండెను. ఆ పొలము కాపు పసువులు తన చేనిని పాడుచేసినవని నానక్ తండ్రికి ఫిర్యాదు చేసెను. ఇది విని ఆయన తండ్రి కోపోద్రిక్తుడయ్యెను. అయితే ఇందు వలన చేనికి కలిగిన నష్టమునంతను వెలకట్టి పూర్తిగా పరిహారమిచ్చుటకు గ్రామ మునసబు కు నచ్చచెప్పి ఆ కాపును పంపివేసెను. ఈ రాయ్బులార్ ఇస్లాము మత రాజపుత్రుడు.


నానక్ చిన్ననాట నుండి ఇరుగు పొరుగు వారి ఆదరాభిమానములకు పాత్రుడయ్యెననుటకు ఇది మంచి నిదర్శనము. నానక్ ఒకనాటి మిట్ట మధ్యాహ్నము మంద బయలులో నిద్రించుచుండగా ఆయన ముఖమునకు ఎండ సోకకుండ ఒక త్రాచు పాము పడగ విప్పి గొడుగుపట్టెనని కూడా గ్రంధస్థము చేయబడియున్నది.


భక్తులు ఇది ఆయనలోని దైవాంశకు నిదర్శన మని విశ్వసించగా, ఇది ఆయన నిర్లక్ష్యమున కు నిదర్శనమని తండ్రి భావించినాడు. ఇట్లుండగా నానక్ కు ఉపనయనము చేయు

సమయం రానేవచ్చెను. గ్రామ జ్యోతిష్కుడు ముహూర్తము పెట్టెను. దగ్గర దూరము నుండి కుటుంబ బందుమిత్రులెందరో వచ్చి చేరిరి. సంప్రదాయానుసారము తండ్రి వచ్చిన వారందరికి గొప్ప విందు ఏర్పాటు చేసెను. అయితే సుముహూర్తమున యజ్ఞోపవీత ధారణ చేయుటకు నానక్ నిరాకరించెను. ఇది చూచి, వచ్చినవారందరు విస్తుపోయిరి. వచ్చిన పెద్దలందరు నీకిది తగదని నానక్ ను మందలించిరి. వారికి నానక్ చెప్పిన జవాబు ఇది..


“మైలపడిన జందెమును నేను ధరించను. ఇది తెగిపోవచ్చు లేదా మండిపోవచ్చు. పైగా పోయినప్పుడు వెంట రాదు” అనెను.


ఐతే తెగనిది, మండి మసికానిది, ఇహపరము లు రెండింటి లోను వెంట ఉండునది అయిన జందెమును ఎట్లు ధరించెదవని ప్రశ్నించగా..


"దయను ప్రత్తి చేసి సంతృప్తిని సూత్రముగా చేసి నిగ్రహమను ముడి వేసి సత్యమను పురి ఎక్కించి ధరించిన ఎడల అది ఆత్మకు తగిన జందెము అగును. ఈ జందెము ఎప్పుడూ తెగదు. మాడి మసికాదు. మురికి కాదు. వృధా కాదు, పోదు. తన గళమున ఇట్టి జందెమును ధరించినవాడే దైవానుగ్రహ పాత్రుడు.” అనెను.


ఈ మొండి జవాబును ఆయన తండ్రి ఏ మాత్రము సహింపలేకపోయెను. పసివాడైన తన బిడ్డ తనకెంతో తలవంపులు తెచ్చినట్లు ఆయన భావించెను. అందుచేత పధ్నాలుగవ ఏటనే గురు దాసపూర్ జిల్లాలోని బటాలా వాస్తవ్యుడైన మూళ కుమార్తె సులఖనీతో నానక్ కి పెండ్లి చేసెను. ఇట్టి అసాధరణ మేధావులైన బిడ్డలను కన్న తల్లితండ్రులంద రివలెనే నానక్ తండ్రి సైతము ఈ వివాహము వలన నానక్ దృష్టి తిరిగి సంసారము సంగతి తప్పక చూసుకొనగలడని, సంసారభారము మెడపై పడినప్పుడు తన కోసము కాకపోయి నను భార్యా పిల్లల కోసమైనను తప్పక ధనార్జనకు పూనుకొని బాగుపడగలడని విశ్వసించెను.


అయితే ఇందువల్ల కూడ ప్రయోజనమేమీ కలుగలేదు. అచిర కాలముననే నానక్ కు శ్రీ చంద్, లక్ష్మీదాసు అను పుత్రులిద్దరు పుట్టిరి. అయిననేమి నానక్ కు సంతోషము లేకుండె ను. అంతట బ్రతుకుతెరువుకై దుకాణమునైన తెరువవలసినదని నానక్ తండ్రి ఆయనకు సలహా ఇచ్చి వ్యాపారమునకు మదుపుగా

కొంత సొమ్ము చేతికిచ్చి పొరుగు గ్రామమున కు పోయి సరుకులు కొని తీసుకొని రావలసిన దని ఆజ్ఞాపించెను.


సరేనని నానక్ సమీప గ్రామమైన చుహారాన్ కి సరుకులను ఖరీదు చేయుటకై వెళుతుండ గా మార్గమధ్యమున కొందరు సాధువులెదురై కొన్ని దినములుగా తాము భోజనము చేయలేదనియు, ఆకలికి నకనకలాడుచుంటి మనియు చెప్పిరి. అది విన్న వెంటనే నానక్ తన వద్ద నున్న ధనమంతయు వారికి ఇచ్చి వేసి దానితో ఆహారము కొనుక్కొని భుజించ వలసినదని చెప్పి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చెను. తండ్రి కోపగించుకొనునేమో యను భయముతో ఇంటికి పోక ఊరు బయట ఒక చోట కూర్చొనియుండెను. నానక్ సరుకులేమియు కొనకుండా వట్టి చేతులతో తిరిగి వచ్చెనని విని తండ్రి తక్షణమే ఆయన ను చూడబోయెను.


తాను ఇచ్చిన డబ్బు ఏమయ్యెనని నిగ్గదీసి అడిగెను.


వెంటనే నానక్ "తండ్రీ, నీవు లాభసాటి వ్యాపారము చేయుమని నాకు సలహా ఇచ్చితివి. అయినప్పుడు ఆకలిగొన్న సాధువులకు అన్నము పెట్టుటకంటే, నాకు  ఇహపర సుఖదాయకము లాభసాటియైనది ఇంకొకటి ఏమి కలదు ?" అనెను.


అసాధారణమూ అసందర్భమూ అయిన ఈ జవాబు విని క్రోధోద్రిక్తుడై ఆయన తండ్రి నానక్ ముఖము పై ఉమ్మి వేసి ఇంటికి తిరిగిపోయె ను. 


*సశేషం*


🕉️❀•••━☆꧂


*

గురునానక్ చరిత్ర - 2*


🛕


కనీసము వ్యవసాయమైన చేయవలసినదని తండ్రి అడుగగా నానక్ అందుకు నిరాకరించెను. ఎందుకనగా ఆయన మరొక రకమైన వ్యవసాయము చేయుచుండెను. తాను కృషి చేయదలచిన క్షేత్రమెట్టిదో వివరించవలసినదిగా తండ్రి కోరినప్పుడు నానక్ ఇలా చెప్పెను..


“నా శరీర మను క్షేత్రములో మనస్సు రైతు. సచ్చీలమే కృషి.  వినయము దానిని తడుపు నీరు. భగవంతుని భక్తియే బీజము. సంతృప్తి దుక్కి. దారిద్ర్యమే కంచె. ప్రేమతో పెంచినప్పు డు ఈ బీజము మొలకెత్తును. ఈ విధముగా సంచరించు వారి గదులు ఆ పంటతో నిండి పోవును. తండ్రీ, మనము ఈ ప్రపంచమును వీడిపోవునప్పుడు అందరినీ ఆశ పెట్టిన సంపదలు మన వెంటరావు. అయితే ఈ సత్యము తెలిసినవారు కొందరే ఉన్నారు. ”


నానక్ అంతటితో ఆగలేదు. “తండ్రీ, నేను నా పొలములో, నాకు, నా కుటుంబమునకు మాత్రమే కాక ఈ సమస్త ప్రపంచ మునకు చాలినంత పండించెదను. ఒకసారి నా చేతి భోజనము చేసినవాడు మరి దేనికీ ఆశ పడడు. పైగా ప్రతివారికి ఈ జన్మకు, పూర్వ జన్మకు సంబంధించిన లెక్కనంతా ఇది తేల్చ గలదు. పైగా ఎవనికి నేను పాలికాపునై పొలము దున్నుచున్నానో వాడు నన్ను అతివృష్టి నుండి అనావృష్టి నుండి కాపాడు చుండును. నేను ఎప్పుడేది అడిగిన, ఇస్తుంటాడు. చాలు నా కింకేమియు వద్దు ”


ఈ జవాబు విని నానక్ తండ్రియైన కాలూ ఎంతో ఆశ్చర్యపోయెను. "బిడ్డా! నీ వలె నేను నీ యజమానిని చూడలేదు. పైగా నీకు మతి పోయినదని సాటివారందరు చెప్పుకొనుచు న్నారు. అందుచేత మన పూర్వులు, పెద్దలు నడిచిన త్రోవను నడువగోరుచున్నాను. పని చేయక ఎవరు బ్రతికిరి ? నీవు మీ తల్లిదండ్రు ల ప్రతిష్ఠను కాపాడుటకైన మేము చెప్పినట్లు చేయుము. సమస్త ప్రపంచములోను మాకు ఆప్రతిష్ఠ తేకుము.”


నానక్ చెప్పిన "తండ్రీ, నా స్వామిని చూచిన వాడెల్ల ఆయనను మెచ్చుకొనెను, ఆయనతో సంబంధ మేర్పరచుకొనెను.” నిరాశతో స్వామిని గురించి మరింత స్పష్టముగా వివ రించవలసినదని, అందువలన తానేకాక, ఇతరులు సైతము పరిస్థితిని అర్ధముచేసుకొ ని నానక్ ని గురించిగాని, కుటుంబమును గురించి కాని దుష్ప్రచారము చేయకుందురని తండ్రి నానక్ కి వివరించెను. 


అంతట నానక్ తల్లి అక్కడికి వచ్చి తన కుమారుని బుజ్జగించి తండ్రి చెప్పిన మాట వినవలసినదని ఎంతగనో ప్రార్థించెను. "నాయనా, నీలో నీవు తన్మయుడవైపోవు చున్నావు. అందువలన నాకు ఆలోచనా శక్తి నశించినదని ప్రజలు అపోహపడుచున్నారు. అందుకనే వారందరూ నిన్ను గురించి మమ్ము  గురించి చెడ్డగా మాట్లాడుచున్నారు. బిడ్డా, నిన్ను గురించి మమ్ము గురించి ప్రజలు మరింతగా చెప్పుకొనవలెనని మా కోరిక.”


ఇది విని నానక్ కళ్లు చెమ్మగిల్లినవి. తల్లికి ఇట్లు జవాబు చెప్పినాడు..


"అమ్మా, మంటలలో మగ్గిపోతున్న ఈ ప్రపంచమును కాపాడవలసినదని నాకు దూర తీరముల నుండి పిలుపు వచ్చినది. అందువలన మన మందరమూ ఈ మంటలలో బడి బూడిదయైపోవుట నీ కిష్టమా? లేక వీలైనంతమందిని ఈ పెను మంటల బారి నుండి కాపాడుట నీ కిష్టమా ?


ఇది వినుసరికి నానక్ మనస్సు మార్చుట దుర్ఘటమని అందరికి తెలిసిపోయెను. పెద్దలందరు కలిసి యోచించి వైద్యుని పిలిపించి పరీక్ష చేయించుట మంచిదని నిశ్చయించుకొనిరి. కాలూ తక్షణమే గ్రామ వైద్యునికి కబురంపించెను. ఆ వైద్యుడు వచ్చి నానక్ నాడిని పరీక్షించుచుండగా, నవ్వి ఇట్లు జవాబు చెప్పెను..


“ఘన వైద్యుడా, నా నాడిని తాకకుము. ఎందుకనగా నా శరీరములో ఏమీ జబ్బు లేదు. ఉన్నదల్లా ఆత్మలోనే. నా సంగతి వదలి, తెలివైనవాడవయితే నీ సంగతి నీవు చూసుకొమ్ము. తనకు తాను స్వాధీనములో లేనివాడు నీ మందు కేమిలొంగును ? నాకు వచ్చిన జబ్బు ప్రేమ రోగము. దీనికి తగిన చికిత్స నేను ఎవరినైతే ప్రేమించుచున్నానో ఆ ప్రియుని కొక్కనికే తెలియును."


ఆ మాట దీని ఆశ్చర్యపడిపోయిన ఆ వైద్యుడు ఆత్మకు పట్టిన జబ్బు ఏమిటో వివరించవలసినదని నానక్ ను కోరెను. ఆ సమయమున నానక్ ఆయనకు చెప్పిన అద్భుతమైన జవాబు ఇది..


"నాకు వచ్చిన జబ్బు ఏమిటంటే నా నుంచి నేను విడిపోయాను. రెండవది. నే నెట్లుండవ లెనో అదే కావలెనని కోరుకొనుచున్నాను. మూడవది నేను సర్వశక్తిమంతమైన మృత్యువు కంటి చూపులో పడ్డాను. నాలుగవది నా అంతట నేను కూర్చొనలేకు న్నాను. ఓ మానవుడా, నీ జబ్బు నీ శరీర ములో లేదు. ఉన్నదల్లా ఆత్మలోనే. అదే కనుక పరిశుద్ధమైనదీ పరిపూర్ణమైనదీ అయితే సమస్త శరీరమూ ఆరోగ్యంగానే ఉంటుంది."


"అయితే మానవుని వ్యాధులకు కారణమేమి ?" అని వైద్యుడడిగిన దానికి నానక్ చెప్పిన జవాబు ఇది..


"విషయ సుఖలాలసత్వం. ఈ సుఖములే ఆత్మకు వ్యాధిని తెచ్చిపెట్టునవి. బాధను కోరి వరించుటే దానికి నివారణోపాయము."


అంతట ఆ వైద్యుడు నానక్ కి నమస్కరించి ఇట్లనెను: "ప్రభూ, నీకు కావలసిన చికిత్స నీలోనే ఉన్నది. కాని ఆయన తల్లిదండ్రులు ఆఖరుసారిగా నచ్చచెప్పదలచి ఇట్లనిరి. "నిన్ను కని పెంచిన వారికి నీ వల్ల పొందదగిన కోరికలు కొన్ని ఉండును. నీవు వా రిమాట మన్నించవా? నిన్నింత చేసిన వారి మీద నీకు ఆపేక్ష అభిమానము లేవా ?”


నానక్ చెప్పిన జవాబు ఇది.


"నా తండ్రి ఎవరో నాకు తెలియదు. అలాగే అమ్మ కూడా. అలాగే నేను ఎక్కడ నుంచి వచ్చినానో తెలియదు. పైగా నీరు నిప్పు కలిసి నన్ను వీళ్లెందుకు తయారు చేసెనో తెలియదు. నాలో ఏదో తీవ్రమైన బాధ ఆత్మ మండిపోతున్నట్టుగా నా గుండెను నులిమి వేస్తున్నది. నా స్వామి కోరికను మన్నించి నప్పుడే నాకు శాంతి కలుగుననిపించు చున్నది.”


(గౌరీ ప్రధమ గురువు)


ఈ పరిస్ధితులలో మరొక చోటికి పోయిన ఎడల నానక్ మనసు తిరిగి మామూలు మనిషి కావచ్చునని ఆయన తండ్రి ఇతర కుల పెద్దలు నిశ్చయించిరి. అందుచేత ఆయన తన సోదరి నానకి భర్తయైన జయ రాముని స్వస్థలనుగు సుల్తాన్పూర్ (ప్రస్తుతం కపుర్ధలా జిల్లాలో నున్నది) వెళ్లిన బాగుండు నని సలహా ఇచ్చిరి. నానక్ బావమరది జయరామ్ ముస్లిమ్ నవాబు కొలుపులో ఉగ్రా ణపు పని చూచువాడు. ఆ ప్రకారమే నానక్ ప్రయాణమునకు సన్నాహములన్నియు పూర్తి అయినవి. ఆయన సుల్తాన్పూర్ కి బయలు దేర బోవుచుండగా "నన్ను కూడ మీ వెంట తీసుకొనిపొండు మీరు అంత దూరము వెళ్లిపోయిన తరువాత నా సంగతి మీకు జ్ఞాపకముండవచ్చును, ఉండకపోవచ్చును. ఇక్కడ ఉన్నప్పుడే మీరు నా విషయమై అంతగా పట్టించుకొనుట లేదు. అక్కడ నన్ను పూర్తిగా మరచిపోదురు కూడ" అని నానక్ భార్య పరిపరివిధముల బ్రతిమాలెను.


నానక్ చిరునవ్వు నవ్వి ఇట్లనెను “వీరందరు కోరినట్లుగా నేను అక్కడ స్థిరపడి నాలుగు రాళ్లు సంపాదించగలిగినట్లయిన నిన్ను వెంటనే పిలిపించుకొనెదను. లేని ఎడల నేను తిరిగి వచ్చు వరకు నీవు ఇక్కడనే ఉండుము. అంతవరకు భగవంతుడే నిన్ను కాపాడగల డు. నీ స్వామిని నీవు మనసార ధ్యానించు చుండుము.”


అంతట ఆమె నానక్ చిన్ని కుమారులిరువు రిని పిలుచుకొనివచ్చి ఆయనకు చూపెను. నానక్ వారిరుపురను ఎత్తుకొని తన గుండెల కు హత్తుకొని ముద్దాడి, ఆశీర్వదించెను. పిమ్మట తన తల్లిదండ్రులకు పాదాభివందన ము చేసి వారి సెలవు తీసుకొనెను. ఇదంతయు చూచి నానక్ ఎట్టకేలకు ఐహిక మార్గమును స్వీకరించెను కదాయని ఆయన తల్లిదండ్రులు భార్య ఎదలో ఎంతో సంతోషించిరి.నానక్ సుల్తాన్పూర్ చేరిన వెంటనే బావమరది జయరాము ఆయనను వెంటబెట్టుకొని తీసుకొనిపోయి నవాబుకు పరిచయము చేనెను. నవాబు, నానక్ వినయము, సత్ప్రవర్తన చూచి ముగ్ధుడై తన ఉగ్రాణము ను ఈతని కప్పగించిన ఎడల సర్వము భద్రముగా నుండగలదని భావించి నౌకరులకు భత్యము కొలుచుపనిని అప్పగించెను. నానక్ వెంటనే కొలువులో చేరి తన ధర్మమును ఎంతో చక్కగా, న్యాయముగా నిర్వర్తింపసా గెను. తన వాటాకు వచ్చిన ధన, ధాన్యముల ను ఎక్కువగా తన వద్దకు వచ్చిన సాధువు లకు పంచి పెట్టుచుండెను. అయితే నానక్ రాజద్రవ్యమును విచ్చలవిడిగా అయినవారికి కానివారికి అందరికీ పంచిపెట్టుచుండెనని వదంతి ఊరంతయు వ్యాపించెను. పైగా పని ముగించుకున్న తరువాత ఆయన అనేక గంటలసేపు నిశ్చలముగా ఏదో ధ్యానించుచు కూర్చుండువాడని కూడ ఫిర్యాదులు నవాబు చెవికి చేరినవి.


పని జేయుచున్నప్పుడు సరుకులు కొలుచు నప్పుడు సైతము పదమూడు సంఖ్య వచ్చిన ప్పుడల్లా 'తేరా' యను పదమును లక్షలసార్లు ఉచ్చరించుచుండెడివాడు. 'తేరా మై తేరా' అని అనేకసార్లు అనేవాడు.


*సశేషం* 

మీ శ్రేయోభిలాషి

భాస్కరా చారి.జి 

తెలుగు పండితులు ఆమనగల్ 

꧁••••━☆꧂

*

గురునానక్ చరిత్ర - 3*


🛕


ఈ అసాధారణ వ్యక్తితో వ్యవహరించడం ఎలాగ అని నవాబు ఆలోచించుచుండగానే నానక్ కనిపించుటలేదని ఆయనకు కబురు చేరెను. ఆయన ఒకనాటి ఉదయము వయ్యాన్ అను వాగుకు స్నానం చేయుటకు వెళ్లెను. అక్కడి నుండి మూడు రోజుల పాటు తిరిగిరాక సమాధి మగ్నుడై ఉండిపోయెను. నానక్ మునిగిపోయెనని ప్రజలందరు భావించిరి. కాని ఆయన తిరిగి కనిపించెను. ఆ మూడురోజుల సమాధిలో ఆయనకు భగవంతుని దర్శనమాయెననియు, అప్పుడు భగవంతుడాయనను ఆశీర్వదించినాడనియు  అతి పురాతనమైన నానక్ జీవితచరిత్రలో లిఖింపబడియున్నది. 


“ఓ నానక్, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీ పేరును ప్రేమతో ఉచ్చరించిన ప్రతి వ్యక్తి కూడ భగవదాశీర్వచనమునకు తప్పక పాత్రుడగు ను. నీవింక ఈ విశాల ప్రపంచములోని కేగి భగవదాదేశమును ప్రజలందరికి వివరింపుము. నేను నీకు నా నామమును అనుగ్రహించితిని. నీవు అనుగ్రహించిన వారెల్ల నా అనుగ్రహమునకు తప్పక పాత్రుల గుదురు. నేను దేవాధిదేవుడను. ఇక నుండి నీవు గురుదేవుడుగా విఖ్యాతుడవుకాగల వు.” అని వినపడెను.


నానక్ దేవునికి పాదాభివందనము చేయగా ఆయనకొక వస్త్రమును భగవంతుడు బహూకరించెనట. సమాధి నుండి తేరుకొని, అంగవస్త్రము మాత్రము ధరించి నగరము నకు తిరిగివచ్చి.. “నా కిక్కడ హిందువుకాని ముస్లిమ్ కాని కనబడుటలేదు. కనబడునది మానవు డొక్కడే." అని పలికెను.


మత ప్రాబల్యము హెచ్చుగా నుండు ఆ రోజులలో నానక్ ప్రకటించిన ఈ అసాధారణ సత్యము కాజీలకు ఎంతో ఆందోళన కలిగించెను. “నానక్ నా దృష్టిలో భాగవత శిరోమణి అనియు ఆయనను మనము కదలించరాదనియు నవాబు ప్రకటించినప్ప టికి, నానక్ ప్రబోధము వలన రాష్ట్రములో గొడవలు బయలుదేరకమానవని కాజీలు భావించిరి. వెంటనే నానక్ ని నవాబు దర్శన మునకు పిలిపించిరి. అట్లు వచ్చిన నానక్ ని చూచి కాజీ ఇట్లనెను..


“నానక్, నీకు మతి పోయినదనియు, ఇది వరకు ఇతరులెన్నడు చెప్పని మాటలను నీవు చెప్పుచుంటివనియు అందరూ అంటు న్నారు. ఇందుకు నీవేమి చెప్పెదవు ?"


నానక్ ఈ ప్రశ్నకు పద్య రూపమున జవాబు చెప్పెను. అప్పటికే తన ముస్లిమ్ శిష్యుడైన

మర్దనా శ్రుతి వేయుచుండగా నానక్ అప్పుడు చెప్పిన పద్యపు సారాంశము ఇది :


"కొందరు నన్ను పిచ్చివాడందురు. మరికొందరు కలిసిరానివాడందురు. మరికొందరు నేను పేదవాడినందురు. ఓ మానపులారా, నా ప్రభువు భగవంతుడంటే పడిచచ్చేవాణ్ణి నేను. నాకు భగవంతుడు తప్ప మరెవ్వరూ తెలియరు. దైవభీతి కలవాడొక్కడే నిజానికి పిచ్చివాడు. తన స్వామిని తప్ప, ఇతరులెవ్వరిని ఎరుగని వాడు. వాడు తన స్వామికార్యమునకే సదా బద్ధుడు. ఆయన ఇష్టప్రకారమే చేయువాడు. తాను ప్రేమించువానిపై యుక్తులు ప్రయోగించ నివాడు. తన స్వామి భగవంతుని తప్ప మరెవ్వరిని ప్రేమించడు. తాను చెడ్డవాడిన నియు మిగతా అందరూ మంచివారు, పరమ పవిత్రులు అని భావించును.”


అంతట కాజీ అడిగెను “ఐనా మా ముస్లిమ్ మతమును విమర్శించుటకు నీకెన్ని వేల గుండెలున్నని ?"


ఆ ప్రశ్నను విని నానక్ తొణకక బెణకక నిబ్బరముగా ఇట్లు సమాధానమిచ్చెను..


"మహమ్మదీయునని చెప్పుకొనుట చాలా సులభము. కాని నిజముగా మహమ్మదీయు డగుట చాలా కష్టము.”


“అయిన నీ దృష్టిలో మహమ్మదీయుడెవరో వివరింపుము”


“దయ మశీదై విశ్వాసము చాపయై సత్య జీవనమే కురాను అయినప్పుడు వినయము ను సున్నతిగా భావించి నిగ్రహమును ఉపవాసముగా స్వీకరించినవాడే నిజమైన మహమ్మదీయుడు.”


అంతట తనతో మశీదుకు వచ్చి ప్రార్ధనలు జరిపి, తేడా తెలుసుకోవలసినదని కాజీ నానక్ ను ఆహ్వానించెను. అందుకు నానక్ చెప్పిన జవాబు ఇది..


 “రోజూ ఐదుసార్లు మీరు ప్రార్ధన చేస్తూ ఉంటారు. నేనూ అంతే. అయితే నా మొదటి ప్రార్ధన సత్యము. రెండవది విశుద్ధ జీవనము. మూడవది దైవానుగ్రహము. నాలుగవది పరి

శుద్ధమైన మనస్సు. అయిదవది దైవచింతన.” 


అయితే కాజీకి ఆశాభంగము కలిగించుట తన కిష్టము లేదని చెప్పి గురునానక్ ఆయన వెంట మసీదుకు వెళ్లి ప్రార్ధనలు చేయుటకు అంగీకరించెను.


మశీదులో ప్రార్ధనలు జరుగుచుండగా నానక్ అందు పాల్గొనక వేరుగా నిలబడి నవ్వు చుండెను. ప్రార్ధనలు ముగిసిన తరువాత కాజీ నానక్ ను అట్లెందుకు ప్రవర్తించితివని కోపముగా ప్రశ్నించెను.


మరల నవ్వి నానక్ ఇట్లు జవాబిచ్చెను.. 


"నీవు నీ భగవంతుని ప్రార్ధించుచుంటివని చెప్పితివి. కాని అది సరికాదు. నీ శరీరము వంగి వంగి దండ ప్రణామములు ఆచరించు చు నమాజు చేయుచుండినప్పుడు నీ మనస్సు అంతయు కాబూలులో చేయబోవు జాతి గుర్రముల బేరముపై నిమగ్నమై ఉండెను కదా! అందుకని."


ఈ జవాబు విని కాజీ నిర్ఘాంతపోయెను. ఇంక నోరువిప్పిన ఎడల అందరిలో మరింత అవమానమగునని భయపడి మిన్నకుండెను. కాని నవాబు ఆ జవాబు విని ఎంతో సంతోషించి ఇట్లనెను..


 “నానక్ నీవంటి దైవభక్తుడొకడు నాకు మంత్రిగా నుండుట ఎంత గొప్ప ఆదృష్టము. నా వద్దనే యుండుము. నేను ఉగ్రాణపు లెక్కలన్నింటిని పరీక్షించితిని, అంతయు సరిగానే యున్నది. నిన్ను గురించి అసూయ తో ప్రజలు ఏమేమో మాట్లాడిరి. నిన్నింక పోనీయను. నీ సంగతి నాకిప్పుడు పూర్తిగా తెలిసినది." అనెను.


కానీ నానక్ ఇట్లు జవాబిచ్చెను..


"అయ్యా మీరు చెప్పిన మంచి మాటలకు కృతజ్ఞుడను. కాని నేనింక మీ కొలుపులో ఉండను. ఇంతకన్నా ముఖ్యమైన పిలుపు ఇంకొకటి వచ్చినది."


అంతట నవాబు ఆయనకు శిరము వంచి ప్రణామము చేసి ఇట్లనెను..


“నేను నీకు నీ స్వామికి మధ్య అంతరాయమై నిలువను. నీ దేవుడెట్లు ఆదేశించిన అట్లే చేయుము. పుణ్య గ్రంధములలో నేను చదివినదానినంతను నేడు ప్రత్యక్షముగా చూచితిని. అదే దివ్య దర్శనము. నేను నీకు చేయదగిన ఉపకారమో, సేవయో ఏదైనా ఉన్నచో సంకోచించక కోరుకొమ్ము. నన్ను నేను ఎంతో  అదృష్టవంతుడుగా భావించుకొందు ను." అనెను.


తనకు దైవభక్తి తప్ప మరేమియు అవసరము లేదని చెప్పి, మర్దనాతో కలసి సాధువు సాంగత్యముకై నానక్ అక్కడి నుండి ఊరి వెలుపలనున్న ఆడవిలోకి వెళ్ళిపోయెను.