సురవరం ప్రతాపరెడ్డి గారి చరిత్ర about Suravaram Pratapareddy biography

 



సురవరం ప్రతాపరెడ్డి 

(28.05.1896 - 25.08.1953)

తల్లిదండ్రులు:- రంగమ్మ, నారాయణరెడ్డి.

జన్మస్థలం:- మహబూబునగర్ జిల్లా ఇటికాలపాడు గ్రామం.

చరిత్ర గిరుల్ని చీల్చుకుంటూ సంస్కృతి రీతుల్నిగవేషించే నిశితమైన చూపు, గంభీరగళంతో స్వచ్ఛందమైన అభిప్రాయాల్ని ధీరంగా వెల్లడించే వాక్కు. ఆత్మగౌరవాన్ని ప్రతిపదంలో విరజిమ్మేగమనం, ఇతిహాస పురాణ శాస్త్ర ప్రబంధాల ఆంతర్యాన్ని ఆకళించు కొన్న జ్ఞానం, సురవరం ప్రతాపరెడ్డిగారు. గోలకొండ పత్రిక ఫిరంగి మోతలతో నిజాం గుండెలో దడ పుట్టించి తెలంగాణ జనావళిని జాగృతం చేసిన ధీరుడాయన. 

విద్యార్థి దశలోనే “దేశబంధు” అనే పత్రికను స్థాపించాలని దినచర్య పుస్తకంలో రాసుకున్నారు.

రాజా బహద్దరు వెంకటరామారెడ్డిగారు హైదరాబాదులోనే ఆయనను ఉంచాలనే భావించి ప్రతాపరెడ్డికి ఇష్టమైన పత్రికాస్థాపనకు అంగీకరించి ఆర్థికంగా సహకరించారు. ఆ విధంగా 10-5-1926 నాడు “గోలకొండ పత్రిక” ను ద్వైవార పత్రికగా వెలువరించారు. ఉర్దూ పత్రికలే తప్ప తెలుగు పత్రికల ముఖం చూడని ఆనాటి పాఠకుల్లో ప్రతాపరెడ్డిగారు తెలుగు భాషపట్ల భాషాభిమానాన్ని పెంచారు. గోలకొండ పత్రిక సంపాదకత్వాన్ని తరువాతి కాలంలో వదలుకోవలసి వచ్చినపుడు మిత్రుల కోరిక మీద “ప్రజావాణి” పత్రికకి కొన్నాళ్లు సంపాదకులుగా వ్యవహరించారు.

సురవరం వారు గ్రంథాలయోద్యమానికి గణనీయసేవ చేశారు. నిజాం పరిపాలనలో అన్ని విధాలా మగ్గుతున్న తెలంగాణ జనావళిని ఉద్బోధించటానికి ఎంతగా కృషి చేశారో గోలకొండ పత్రికలోని రాతలు, రచనలు ఉదాహరణలు.

ప్రతాపరెడ్డిగారి రచనల్లో అన్నీ విశిష్టమైనవే. అయినా “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”, “రామాయణ విశేషములు”, “హిందువుల పండుగలు” జాతి చెప్పుకోదగిన గొప్ప రచనలు. కచకుచ వర్ణనలతో నిండిన ప్రబంధ రచనల్ని, సూక్ష్మేక్షికతో పరిశీలించి అందులో జనసామాన్య జీవితాన్ని దర్శించారు. ఆంధ్రుల సాంఘిక చరిత్రలో తూర్పు చాళుక్యయుగం నుంచి పందొమ్మిదవ శతాబ్ది పర్యంతం తెలుగు సంస్కృతిలోని ప్రధాన విషయాల్ని తేటతెల్లంగా తెలిపి తెలుగువారికి సాంఘిక చరిత్రతత్త్వాన్ని చాటారు. 1949లో వెలువడ్డ ఆ గ్రంథం ఈనాటికి అద్వితీయం. ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రసాహిత్య బహుమతి పొందిన తొలిగ్రంథం. ఈ బహుమతిని వారు అప్పటికి కీర్తిశేషులు కావడం వల్ల వారి శ్రీమతి స్వీకరించారు.

'హిందువుల పండుగలు' భారతీయుల - ముఖ్యంగా తెలుగువారి పర్వాల్ని, వ్రతాల్ని గురించి విశదపరుస్తుంది. పండుగల వెనుక ఉన్న పరమార్థాన్ని చారిత్రక దృష్టితో సమీక్షించారు.

'రామాయణ విశేషములు' ఆయన గ్రంథావలోకన దక్షతకూ, విచక్షణ శీలానికి నిదర్శనం. వాల్మీకి రామాయణాన్ని ఆధ్యాత్మిక కోణం నుంచి భావించడం వేరు, శాస్త్రీయ దృక్పథంతో అనుశీలించడం వేరు. ఒక్కొక్క శీర్షిక క్రింద చర్చించిన విషయం ఆయన విషయ పరిజ్ఞానానికి మచ్చుతునక. మనకు తెలియని ఎన్నో విశేషాల్ని రాసులుగా పోసి రచనలు చేశారు. ఈనాడూ అది చాలా విలువైన గ్రంథం.

సురవరం వారు మంచి కవితలు సృజించారు. మహబూబునగర్ భాషలో సీసాలు దండకాలు రచించారు. 'అవి బాలిగ! నీవు అట్టుకుపోని కిస్కింత సేపు కాళ్లోత్తి పోసేకసేపు, పైటాలదుకునంలో పదిసేర్ల సంజర ఇప్పిచ్క రారోరి ఎల్లపోడ' అని రచించడం మాండలికం మీద ఆయనకున్నఅభిమానానికి నిదర్శనం.

సురవరం వారు తెలంగాణా గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తూ ప్రముఖంగా పదమూడు కథలు రచించారు. ఆకథల్లో నిజాం ప్రభుత్వ దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తు వస్తున్న యువకుల్లోని ఆవేశాన్ని చిత్రించారు. ఇక ఆయన కథారచన శిల్పానికి తలమానికం 'నిరీక్షణ' కథ. ఇది అనేక భారతీయ భాషల్లోకి అనూదితమైంది. 'నా కథల్లో ఉర్దూపదాలు కొంచెం ఎక్కువే' అని ఆయనే చెప్పుకున్నారు. అవి ఒక సంపుటంగా వెలువడ్డాయి. ముఖ్యంగా 'వింత విడాకులు' కథ చదివితే నాటి తెలంగాణ సామాజిక వాతావరణం కళ్లముందు కదలాడుతుంది. వారు అణా గ్రంథమాల పక్షాన రెండు చిన్న కథాసంపుటులు 'మొగలాయికథలు' అనే పేరుతో వెలువరించారు. అవి చక్కని అధిక్షేప రచనలు. నిజాం కాలంనాటి అధికరుల దౌర్జన్యాన్ని అధిక్షేపించిన ఈ కథల్లోని వ్యంగ్యధోరణి ఎంతో సరసంగా ఉంది.

“హైందవ ధర్మవీరులు” లో ప్రతాపరెడ్డిగారి దేశాభిమానం నిలువెత్తుగా నిలిచింది. సోమనాద్రి, తానాజీమాలుసురే లాంటి కథలు కణకణలాడే నిప్పుకణికలు. ఇది ఆనాడూ ఈనాడూ పఠనీయ గ్రంథం. రాజతరంగిణిలోని వస్తువును ఆధారంగా తీసుకొని 'ఉచ్ఛలవిషాదం' నాటకాన్ని రచించారు. ఇది విషాదాంత నాటకం. 'ఘనసువాసనలిచ్చి గాలికి తలయూచి మరునాడువాడునే మల్లెపువువ' లాంటి మనోజ్ఞమైన పద్యాలు ఇందులో ఉన్నాయి. ఇక మరొక నాటకం 'భక్తతుకారాం'. భక్తతుకారాం నాటకాన్ని భక్తి అనురాగాల భావసంగమంగా, రసతీర్థంగా తీర్చిదిద్ది చక్కని నుడికారంతో వ్యావహారిక భాషలో వెలువరించారు. ప్రతాపరెడ్డిగారు వందలకొలది వ్యాసాలు రచించారు. ఎవరూ ఊహించని అంశాలపై వారు వ్యాసాలు రచించారు. మామిడిపండు, తాంబూలసేవనం లాంటివి నాటికి సరికొత్త అంశాలు. లిపి సంస్కరణ గురించి లఘుపుస్తకం వెలువరించారు. అందులో కన్నడ తెలుగులకు ఏకలిపి ఎలా ఉండవచ్చో సూచనలు చేశారు.

ప్రపంచ భాషలకు ఏకలిపిని ప్రతిపాదిస్తూ జార్జ్ బెర్నాడ్ షాకు లేఖ రాశారు. వయోజన విద్య కోసమని “యువజన విజ్ఞానము” అనే గ్రంథాన్ని సంతరించారు. సామాన్య జనానికి రాజ్యంగ విధానాన్ని తెలియపరచటానికి 'ప్రజాధికారములు', 'ప్రాథమిక స్వత్వములు' అనే గ్రంథాలను రచించి ప్రకటించారు. ఆయన సంఘసంస్కరణ వాంఛ ఎంత ప్రగాఢమైందో 'సంఘోద్ధరణం' గ్రంథం చెబుతుంది. పల్లెపట్టుల పస తెలిసిన వారు గనుకనే 'గ్రామ జనదర్పణం' గ్రంథం రచించారు. అనేక జానపద గాధలు సేకరించి ఆ పాటల విశిష్టతను లోకానికి చాటి చెప్పారు.

గోలకొండ పత్రికలో అనేక జానపద గేయాలు ప్రకటించి వాటి ప్రాముఖ్యతను స్పష్టీకరించారు. తాళపత్ర గ్రంథాలు సంపాదించి పండిత పరిషత్తులకు అందించారు. సురవరం వారి గ్రంథ పరిష్కరణకు, పీఠికారచనకు వావిళ్ల వారు ప్రకటించిన 'శుకసప్తతి' ఒక నిదర్శనం.

ఎవరో తెలంగాణలో కవులు లేరు అని చులకనగా మాట్లాడితే అలాంటి వారి నోరు మూయించడానికి తెలంగాణలోని ప్రముఖులైన 354మంది కవులతో “గోలకొండ కవుల సంచిక” వెలయించి తెలంగాణ సాహిత్యవేత్తల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు.“విజ్ఞానవర్ధినీ పరిషత్తు” స్థాపించి ఎందరో రచయితల్ని పరిశోధకులను తీర్చిదిద్దారు. ప్రతాపరెడ్డిగారు వ్యక్తికాదు ఒక సంస్థ అన్నది అక్షరాలా యథార్థమే.

ప్రతాపరెడ్డి గారు తెలుగువారికి వెలుగులు చూపిన దీపస్తంభం!


(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “తెలంగాణ తేజోమూర్తులు” గ్రంథం నుండి.)


                సంకష్టహరణ చతుర్ధి, కపిలాషష్ఠి, అనంత చతుర్దశి, మహాలయపక్షము, తులసి వ్రతము. ఋషీ పంచమి, బుద్ధజయంతి, చంపాషష్ఠి, హరితాళిక, స్కందషష్ఠి, దశహర, అశోకషష్ఠి, శీతలసప్తమి ఏరువాక పున్నమ, వాటాసావిత్రి వ్రతము. అముక్తాభరణం, ఇలాంటి మరి ఎన్నో మనకు తెలియని విశేషమైన పండుగలు, ఉత్సవాలు, వేడుకలు గురించి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు "హిందువుల పండుగలు" అనే పుస్తకంలో వివరించారు. ఈ విషయాలను తెలుసుకోవడానికి తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన “హిందువుల పండుగలు” అనే పుస్తకాన్ని చదవండి. (వెల -100/-)

వివిధ రామాయణ కథలు, జైన రామాయణము, జైన కధ-రాక్షసవానరోత్పత్తి, రావణుని దిగ్విజయము. హనుమంతుని జన్మ కద, శ్రీ రాముని జననము, సీతాపహరణము, సీతాన్వేషణము, యుద్ధకాండము, లఘు విమర్శ, బౌద్ధ జాతక రామకథ, ఇతర రామ కథలు, కదాసరిత్సాగరము, రామవాల్మీకుల కాలము, మహా భారత కాలము, ఇంద్రపూజా ప్రాముఖ్యము. ఋగ్వేదములో రాముడు, వాల్మీకి కాలము, మార్గ విదానము........ ఇలాంటి అనేక విశేషముల గురించి శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారు “రామాయణ విశేషాలు” అనే పుస్తకంలో వివరించారు. ఈ విషయాలను తెలుసుకోవడానికి తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన “రామాయణ విశేషాలు” అనే పుస్తకాన్ని చదవండి. (వెల: 130/-)