About Dasharathi Rangacharya || దాశరథి రంగాచార్యులు

            దాశరథి రంగాచార్య

(24.08.1928-08.06.2015)

జన్మస్థలం: ఖమ్మం జిల్లా చిన గూడూరు.

 అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథి రంగాచార్య అనగానే ఊర్ధ్వపుండ్రాలు ధరించిన సంప్రదాయ రూపం, ఆ రూపం వెనకాల ఉన్న మార్క్పిస్టు దృక్పథం వెంటనే స్ఫురణకు వస్తాయి. దాశరథి రంగాచార్య జీవితం భిన్న వైరుధ్యాల నిలయం. ఆయనను చూస్తే, నిజాం నవాబుకు వ్యతిరేకంగా సాగిన పోరులో తుపాకీ పట్టి పోరాటం చేశారని, ఆయన నుదిటిపై కనిపించే తిరునామాలు చూసి ఆయనొక మార్క్పిస్టు అని ఎవరూ అనుకోరు. కానీ, ఆయన విప్లవశక్తికి ప్రతీక.

 రంగాచార్య మార్క్పిజాన్ని ఎంతగా ప్రేమిస్తారో, సంప్రదాయాన్ని అంతగా ఇష్టపడతారు. తెలుగు సాహిత్యానికి నిక్కమైన నీలాల్లాంటి నవలలు అందించిన రంగాచార్య, అదే చేత్తో రామాయణ, భారత, భాగవతాలు, వేదాలు, ఉపనిషత్తులు తెలుగు జాతికి అందించారు. భిన్న ప్రక్రియల్లో రచనలు చేసి తెలుగు సాహితీ క్షేత్రాన్ని సుసంపన్నం చేశారు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ దృక్పథానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన దాశరథి రంగాచార్య... స్వాతంత్ర్య సమర యోధుడిగా, అక్షర వాచస్పతిగా ప్రజల హృదయాల్లో పీఠం వేసుకున్నారు.

 ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు చేత "ఆంధ్రగోర్కీ”గా ప్రశంసించబడిన దాశరథి రంగాచార్య 1928 ఆగస్టు 24న పూర్వపు వరంగల్ జిల్లాలోని చినగూడూరులో జన్మించారు. కవితా ప్రపంచంలో లబ్దప్రతిష్టులైన దాశరథి కృష్ణమాచార్య వీరి అగ్రజుడు. రంగాచార్య వచన రచనను చేపట్టి, కాల్పనిక, సాంప్రదాయ సాహిత్య సృష్టిలో అనితర సాధ్యమైన స్థాయికి చేరుకున్నారు. స్వయంకృషితో చదువుకొని 1951లో ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించారు. తర్వాత 1957లో సికింద్రాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ లో అనువాదకులుగా చేరి, 1988లో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పదవీ విరమణ పొందారు.

 రంగాచార్య తనదైన పద్ధతిలో తెలంగాణా ప్రజల జీవన చిత్రణ కోసం నవలా రచనకు పూనుకున్నాడు. ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నవలా రచనకు సంబంధించి పుస్తకాలు అధ్యయనం చేశారు. మొదటి నవల “చిల్లర దేవుళ్లు” వెలువరించారు. తెలంగాణా గురించి తెలంగాణా మాండలికంలో రాసిన నవల కావడంతో విశేష ఆదరణ పొందింది. మొదటి నవలకే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందారు రంగాచార్య.“చిల్లర దేవుళ్లు” చలనచిత్రంగా కూడా వచ్చింది. 'చిల్లరదేవుళ్లు'లో 1938కి పూర్వపు తెలంగాణా ప్రజల జీవనాన్ని చిత్రిస్తే, తెలంగాణా సాయుధ పోరాటంలో స్వర్ణయుగం లాంటి 1942-48 కాలాన్ని “మోదుగుపూలు” వర్ణిస్తుంది. 

 రంగాచార్య గారు నిర్వహించిన పోరాట చిత్రణమే 'మోదుగుపూలు' నవల ఇతివృత్తం. నిజాం రాజ్యంలో ఉండే నామమాత్రపు హక్కులు కూడా ఉండని ఒక జాగీరులో, ఉద్యమ నిర్మాణం, అది ఎదిగిన తీరు. ప్రజలు ఏకమై తహసీల్దారును హతమార్చిన సంఘటనలు, కోయ ప్రజల జీవన విధానం, వారి అమాయకత్వం, ఉద్యమంలో భాగస్వాములు కావడం కన్నులకు కట్టినట్టు చిత్రించారు రంగాచార్య. స్వాతంత్ర్యం తర్వాత సుమారు రెండు దశాబ్దాల సుదీర్ఘ కాలాన్ని 'జనపదం' నవలలో చిత్రించారు.

  నగర సమస్యల ఇతివృత్తంతో 'మాయాజలతారు' రాశారు. భారతదేశంలో సామ్యవాద స్థాపన జరుగుతుందన్న ఆశలను, ఆశయాలను 'రాస్తున్నది ఏదినిజం?' నవలలో చిత్రించారు. "మానవత” నవలలో “మతాలు వెలసిపోయే రంగులు, మానవత నిరంతరం నిలిచి ఉండే ఘనత” అనే సందేశం ఇస్తారు. ఒక బ్రాహ్మణునికి, ఒక హరిజనునికి మధ్య స్నేహాన్ని కల్పించి, మానవత్వం దైవత్వానికి అతి దగ్గరని “శరతల్పం” నవలలో నిరూపించారు. స్వాతంత్ర్యం తర్వాత కూడా ఆ స్వాతంత్ర్యపు వెలుగు ప్రసరించని గ్రామాలు ఎలా దోపిడీకి గురయ్యాయో, ఆ దోపిడీలో ప్రజల విషాద జీవితాలు, టీచరమ్మ నుంచి చైతన్యం పొంది గ్రామస్తులు తిరగబడి విజయం సాధించడం “పావని" నవల చిత్రిస్తుంది. 

 వీటి తర్వాత రంగాచార్య దృష్టి సంప్రదాయ సాహిత్యంపై పడింది. భారతం, వేదాలు, ఉపనిషత్తులు అనువదించిన తర్వాత మళ్లీ నవలా రచనకు ఉపక్రమించారు రంగాచార్య. ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణ ప్రభావంతో మరణం వైపు పయనిస్తున్న ప్రజలను అమృతం వైపు పయనింపజేసే “అమృతంగమయ” నవలను రాశారు. 

 రంగాచార్య మొత్తం 9 నవలలు రాశారు. వీటిలో చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం నవలలు పిరియాడిక్ నవలలు కావడంతో ఒక నవల ముగింపు మరో నవలకు ప్రారంభం అవుతుంది. నవలల్లో ఇతివృత్తంతో పాటు, తెలంగాణా మాండలిక ప్రయోగం కూడా రంగాచార్యకు మంచి పేరును సంపాదించి పెట్టింది.

 రంగాచార్య అనగానే నవలా రచనే గుర్తొస్తుంది. కానీ నవలల కంటే ముందే, ముప్పై మూడేళ్ల వయసులోనే ఆయన "శ్రీమద్రామాయణము” రచించారు. కాలక్రమంలో వాల్మీకి రామాయణంలో చోటు చేసుకున్న అవాల్మీకాలు లేకుండా అచ్చంగా వాల్మీకి ప్రొక్షమైన రామాయణాన్ని తెలుగువారికి వచనంలో అందించారు. 

 రామాయణం తర్వాత "శ్రీమద్భాగవతం" రాశారు. ఈ రచనలో వ్యాసున్ని అనుసరించినా, పోతన పద్యాల రుచిని పాఠకులకు చూపించారు. “సీతాచరితం” పేరు మరోసారి రామాయణాన్ని రాశారు. హరివంశ సహిత “మహాభారతము” రచించారు. రామాయణ, భారత, భాగవతాలు రాసిన తర్వాత ఇక భారతీయ సంప్రదాయ సాహిత్యంలో హిమవదున్నతమైన నాలుగు వేదాలను ఎంతో శ్రమించి తేట తెలుగు వచనంలో అందించారు. 

 వేదాల తర్వాత పది ఉపనిషత్తులు, ఋగ్వేద శాంఖాయన బ్రాహ్మణము, ఋగ్వేద ఐతరయ బ్రాహ్మణము, వేదంజీవననాదం - పరిచయం, వేదం జీవననాదం - ఋగ్వేదపరిచయం, మానస తిరుప్పావై, తాను దర్శించిన దేశంలోని యాత్రా స్థలాల విశేషాలతో “యాత్రా జీవనం” రచించారు. రంగాచార్య జీవిత చరమాంకంలో 'ఉపదేశగీత' పేరుతో రాసిన భగవద్గీత ఆయన మరణానంతరం ప్రచురితమయింది.

 ఆయన రాసినవన్ని ఉద్గ్రంథాలే. అయితే, రంగాచార్య కథ చెప్పి వదిలేయలేదు. సాహిత్యంలో తనకున్న పరిజ్ఞానం, ప్రపంచ జ్ఞానంతో ఆ కథకు సంబంధించి పూర్వాపరాలు, మంచి చెడులు చర్చించారు. ఈ విధానాన్ని 'శ్రీమద్రామాయణము'తో ప్రారంభించారు. అయితే తర్వాతి రచనల్లో తన అభిప్రాయాలకు "ఆలోచనామృతము” అనే పేరు పెట్టారు. ఆయన వ్యాఖ్య నిజంగా అమృత ప్రాయమైన ఆలోచనలు కలిగిస్తుంది.

 రంగాచార్య జీవితానికి, అనువాదాలకు విడదీయని బంధం ఏర్పడింది. ఆయన చాలా చిన్నతనంలోనే వారి తండ్రి నిర్వహించిన “దాశరథి" పత్రిక కోసం ద్రావిడ గ్రంథాలు అనువదించారు. తర్వాతి కాలంలో ఆయన సాహితీ జీవితం అనువాదంతోనే ప్రారంభం అయింది. కోల్‌కతాలో వచ్చిన కరువు రక్కసి గురించి ప్రఖ్యాత భారతీయ ఆంగ్ల రచయిత భవానీ భట్టాచార్య రాసిన నవల “He Who Rides A Tiger” ను “దేవుని పేరిట” పేరుతో తెలుగులో అనువదించారు. ఆ నవలను వట్టికోట ఆళ్వార్ స్వామి దేశోద్ధారక గ్రంథ మండలి తరపున ప్రచురించారు. తెలుగు కథలను ఉర్దూలోకి “తెలుగు అఫ్సానే” పేర అనువదించారు. ప్రముఖ ఉర్దూ కవయిత్రి జీలానీబాను కథలను "కేదారం” పేరుతో తెలుగులోకి అనువదించారు. ఉర్దూ నవల “ఉమ్రాన్ జాన్ అదా” ను తెలుగులోకి అనువదించారు.

 రంగాచార్య తొలినాళ్లలో పిల్లల కోసం వివేకానందుడు, మహాత్ముడు కాళిదాసు మూడు నాటకాలు, శ్రీవేంకటేశ్వర లీలలు అనే పుస్తకాలు రచించారు. ఈ పుస్తకాలు పిల్లల కోసమే అయినా, పూర్తి సమాచారాన్ని ఇస్తాయి. పిల్లలతో పాటు పెద్దలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇక 1962లో భారత్ పై చైనా దాడి చేసినప్పుడు, తెలుగులో వెలువడిన కవితలను "రణభేరి” పేరు తెలుగులోకి అనువదించి ప్రచురించారు. రంగాచార్య రచనల్లో 'దేహదాసు ఉత్తరాలు', 'జనరంగం' శతకం స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో ప్రజల జీవన విధానాన్ని, మారుతున్న సామాజిక వ్యవస్థను, పతనమవుతున్న విలువలను చిత్రిస్తాయి. 

 ఇక రంగాచార్య 21 కథల సంకలనం "నల్లనాగు” సమకాలీన సమాజంలోని భిన్న పార్శ్వాలను చిత్రిస్తుంది. వీటితో పాటు “ప్రేమ్ చంద్ జీవితం సాహిత్యం”, “మానవ కవిత”,"అభిజ్ఞాన శాకుంతలం" శతాబ్ది, శ్రీరామానుజ చరితామృతమ్, శ్రీశంకర చరితామృతమ్, బుద్ధభానుడు, రామాయణం పాత్రలు, భారతంలోని సూక్తులు, వివిధ కవుల గురించిన వ్యాసాలు, ఆయా పత్రికలకు రాసిన వ్యాసాలు రంగాచార్య అక్షర సృష్టిలో భాగంగా ఉన్నాయి. రంగాచార్య రచనల్లో ప్రత్యేకంగా పేర్కొనవలసిన మరొక రచన “జీవనయానం”. అది రంగాచార్య జీవిత కథ.'జీవనయానం' లో రంగాచార్య తన జీవితంతో పాటు, ఏడు దశాబ్దాల తెలుగుజాతి జీవితాన్ని చిత్రించారు. 

 ఒక రచయిత చేతిరాతలో 38వేల పేజీలు, ప్రచురణలో 17వేల పేజీలు రాయడం అనన్య సామాన్యం. నభూతో నభవిష్యతి. ఆయనొక విశ్వమానవుడు. తన రచనల ద్వారా ఉద్యమాల ద్వారా విశ్వమానవ శ్రేయస్సును కాంక్షించాడు. మార్క్పిస్టు భావజాలంతో సంప్రదాయంలో ఆధునికతను, అభ్యుదయాన్ని దర్శించారు. రంగాచార్య చివరి వరకు అదే దృక్పథంతో రచనలు చేశారు. సుదీర్ఘమైన సాహితీ జీవితానికి రంగాచార్య జూన్ 8, 2015న తనువు చాలించారు.


(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “తెలంగాణ తేజోమూర్తులు” గ్రంథం నుండి.)