సినారె || About Singireddy Narayanareddy || about sinare || సింగిరెడ్డి నారాయణరెడ్డి

 



        డా. సి. నారాయణరెడ్డి 

(29.07.1931-12.06.2017)

తల్లిదండ్రులు: బుచ్చమ్మ, సింగిరెడ్డి మల్లారెడ్డి.

జన్మస్థలం: కరీంనగర్ జిల్లా హనుమాజీపేట.

తెలంగాణ జానపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల బడిలో పెరిగి ఇంతింతై విరామ్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించినవారు డా. సి. నారాయణరెడ్డి. ఆయన జీవనగాథ స్ఫూర్తి దాయకమైంది. ఆయన నడిచి వచ్చిన దారి కవితా కర్పూర కళికలమయమైంది.

1931 జూలై 29న కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీ పేటలో నారాయణ రెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ, సింగిరెడ్డి మల్లారెడ్డి. ఖాన్గీ బడిలో అక్షరాలు దిద్దుకొని, సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్ లో ఉన్నత పాఠశాల విద్య, అనంతరం హైదరాబాద్ చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ, ఎం.ఎ. పూర్తి చేశారు. నారాయణరెడ్డి పాఠశాలలో చదువుతున్నప్పుడే నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 'సత్యాగ్రహం’ చేశారు.  ‘సైనికులం మేం సైనికులం' అని పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. 

6, 7 తరగతుల్లో వున్నప్పుడే భక్తప్రహ్లాద, సీతాపహరణం, రఘుదేవ రాజీయం వంటి నాటికలు రాసి మిత్రులతో కలిసి ప్రదర్శించారు. 'ఒకనాడు ఒక నక్క ఒక అడివి లోపల' అంటూ సీసపద్యం రాస్తే, ఉపాధ్యాయుడు ధూపాలి వెంకటరమణాచార్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొన్ని మెలకువలు చెప్పారు. ఇంటర్మీడియెట్ లో ఉండగా జువ్వాడి గౌతమరావు 'జనశక్తి' పత్రికలో తొలి కవిత ప్రచురితమైంది. బి.ఎ.లో ఉండగా పాములపర్తి సదాశివరావు సంపాదకత్వంలో వెలువడే కాకతీయ పత్రికలో రచనలు ప్రచురితమయ్యాయి. ఇది 1950కి ముందే జరిగింది.

21 ఏళ్ళ వయసులో నారాయణరెడ్డికి రేడియోతో అనుబంధం ఏర్పడింది. 1952లో బి.ఎ విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాలయములో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు హైదరాబాద్ లో ఖైరతాబాద్ లో వున్న దక్కన్ రేడియోలో ప్రసారమైన 'సాగుమా ఓ నీలమేఘమా గగనవీణా మృదులరావమా' అన్న గీతం నారాయణరెడ్డి పరిణత కవిగా ఎదిగే దశలో తొలిమెట్టుగానిలిచింది. 'పూలపాటలు', 'చిరుగజ్జెలు' ఉపద్రేష్ట కృష్ణమూర్తి సంగీత దర్శకత్వంలో రూపొంది ప్రసారమయ్యాయి. 'నవ్వనిపువ్వు' గేయనాటిక ప్రసారమైంది. బుచ్చిబాబుగారు ప్రత్యేకంగా రాయించిన 'అజంతా సుందరి', ఆ తర్వాత 'రామప్ప' సంగీతరూపకం ఆకాశవాణి జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చిపెట్టింది. 12 భాషల్లోకి అనువాదమైంది.

1952లో బి.ఏ. ఫైనల్ విద్యార్థిగా వున్నప్పుడే తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శిగా వున్నారు. సంఘానికి తర్వాత అధ్యక్షుడయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అంతటా పర్యటించి కవితా పఠనాలు, కవితాత్మక ప్రసంగాలు చేసి ఆనాడే ఈ ప్రాంతంలో కవితా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు సినారె.

ఉస్మానియా విశ్వవిద్యాలయం నారాయణరెడ్డి కవితామూర్తిని అంచెలంచెలుగా సమున్నత స్థాయికి తీసుకువెళ్ళింది.1954లో బి.ఏ, ఎం.ఏ. పూర్తి చేసి సికింద్రాబాద్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ప్రవేశించారు. తర్వాత నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఆర్ట్స్ కళాశాలలో ఆచార్యత్వం, తనకు సాహిత్య విద్యనేర్పిన గురువులు కె. గోపాలకృష్ణారావు, దివాకర్ల వేంకటావధానితో కలిసి ఆచార్యులుగా పని చేసిన అరుదైన ఖ్యాతి సినారెకు ఆనాడే దక్కింది. ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో 'ఆధునికాంధ్ర కవిత్వము- సంప్రదాయములు- ప్రయోగములు' అన్న అంశంపై పీ.హెచ్.డి. చేశారు. పరిశోధనాంశాన్ని సూచించిన వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

1961లో సినీ గీతరచన ప్రారంభమైంది. హైదరాబాద్ సారథీ 'స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలో వున్న నందమూరి తారకరామారావు సినారెతో ప్రస్తావన చేశారు. అప్పటికే తాను రాసిన పాటల్ని ఎన్టీఆర్‌కు వినిపించారు. తొలి చిత్రంలో అన్ని పాటలు తనవే ఉండాలన్న కోరికను వ్యక్తపరచారు. “గులేబకావళి కథ” సినిమాకు అప్పటికే ఒకరి చేత ఒక పాట రాయించి వున్నారు ఎన్టీఆర్. అయినా సినారె అభిమతాన్ని అనుసరించి ఆ కవికి నచ్చజెప్పి అన్ని పాటలు రాయించారు. తొలుత రాసిన పాట 'కలల అలలపై తేలెను'. కాని తొలుత రికార్డయ్యింది 'నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని'. ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించారు. నాటి నుంచి ఎన్టీఆర్ తో గీతానుబంధం, గాఢమైన స్నేహానుబంధం. ఎన్టీఆర్ చివరి దశవరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగింది. 1961 నుండి 1990 వరకు డా.సి.నారాయణరెడ్డి సినీ గీత రచన ఒక స్వర్ణయుగం. ప్రాచీనాధునిక కవిత్వధ్వయనానుభవం వల్ల సినారె ప్రతి పాటలో తన కవిత్వముద్రను నిలిపారు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నో...! మొత్తం సుమారు 3వేల పాటలు రాశారు.

ప్రౌఢతరమైన పద్యకృతికి తుల్యంగా కథాత్మక గేయకావ్యం 'నాగార్జున సాగరం' రాశారు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ వంటి విద్వన్మణుల ప్రశంసలు లభించాయి. తర్వాత 'కర్పూర వసంత రాయలు' రాశారు. దేశవిదేశాల్లో కావ్యగానం చేశారు. నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేకంగా షామంజిల్ లో 'నాగార్జున సాగరం' కావ్యగానం ఏర్పాటు చేసి సత్కరించారు. మద్రాసులో అక్కినేని అధ్యక్షతన జరిగిన 'కర్పూర వసంత రాయలు' కావ్యగానం అద్భుత స్పందన కలిగించింది.

గేయ కావ్యాలలోనే మహాకవి అనిపించుకున్న సినారె అంతటితో ఆగలేదు. భావకవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యం సాగుతున్న కాలంతో పోటీపడాలని నిర్ణయించుకొన్నారు. సృజన పౌరుషంతో వచన కవిత రచనను ఉద్ధృతం చేశారు. 'మంటలూ మానవుడు', 'తేజస్సు నా తపస్సు', 'అక్షరాల గవాక్షాలు', 'మధ్యతరగతి మందహాసం'. 'విశ్వంభర' ఇలా కవితాయాత్ర కొనసాగింది. భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం 'విశ్వంభర'కు లభించింది. ఇది ఓ దీర్ఘ కవిత. ఆదిమ కాలం నుంచి ఆధునిక కాలందాకా సాగిన మానవ విజయ ప్రస్థానమే ఈ కావ్యం.

పద్యం, గేయం, వచన కావ్యాలు, నాటికలు, గజళ్ళు, ముక్తకాలు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, బుర్రకథ, యాత్రాసాహిత్యం, ఇలా అనేక ప్రక్రియల్లో 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం దాకా విస్తరించి కాలంతో పాటే సాగుతూ వర్తమాన తరపు కవులతోనూ పోటీపడుతూ సాహితీ సృజన చేశారు సినారె. 86 ఏళ్ళ వయసు, 86 రచనల సొగసు ఆయనది.

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షునిగా సినారెను గౌరవించారు. ఆ పదవీకాలం పూర్తికాగానే తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా నియమించారు. తర్వాత సాంస్కృతిక మండలి అధ్యక్షులయ్యారు. భాషా సాంస్కృతిక సలహాదారులయ్యారు. కవులు, కళాకారుల తరపున రాష్ట్రపతి చేత రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. కవితా రచన కొనసాగిస్తూనే విద్యా సాంస్కృతిక సంస్థల పరిపాలనా పదవులనూ వెలిగించారు సినారె.

ఏడు దశాబ్దాల కవితా సృజనానుభవాన్ని పండించుకున్న మహాకవి డా.సి.నారాయణరెడ్డి తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలు అందుకున్నారు. మీరట్ విశ్వవిద్యాలయం, నాగార్జున, కాకతీయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. సోవియెట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజాలక్ష్మీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్ట పురస్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, లెక్కలేనన్ని సత్కారాలు సినారెను గౌరవించాయి. ఆయన నిరంతర కవితాస్రష్ట. చనిపోయేంతవరకు (జూన్ 2017) రాశారు. 

ఔత్సాహిక, ప్రముఖ కవుల రచనలకు ఆశీస్సులందిస్తూనే వున్నారు. మునుపటి ఆంధ్ర సారస్వత పరిషత్తు, నేటి తెలంగాణ సారస్వత పరిషత్తుకు చివరి వరకు అధ్యక్షులుగా వుంటూ తెలుగు భాషా సంస్కృతుల వికాస కృషిని అవిరళంగా కొనసాగించారు.

అందుకే సినారె నిరంతర తేజోమూర్తి…! ఆయన రచనలు నిత్య చైతన్య స్ఫూర్తి!!

(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “తెలంగాణ తేజోమూర్తులు” గ్రంథం నుండి.)


"శ్రీ కైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోకర

క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్ దానవో

ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూతనా

నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్"


"పలికెడిది భాగవతమఁట;

పలికించువిభుండు రామభద్రుం డఁట; నేఁ

బలికిన భవహర మగునఁట;

పలికెద వేఱొండుగాథఁ బలుకఁగనేల”


ఇలాంటి మహాకవి పోతన రాసిన భాగవత పద్య మకరందాలపై విశ్లేషణ చదవాలంటే తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన డా. సి. నారాయణరెడ్డిగారు రచించిన "మందార  మకరందాలు" అనే పుస్తకం చదవండి. (వెల:- రూ. 30/-)