Phone Settings || How to set microphone in phone Settings

 Choopunnamata

Microphone: ఫోన్‌లో యాప్‌లు మైక్రోఫోన్‌ వాడుతున్నాయని అనుమానమా? ఇలా చెక్‌ చేసుకోండి!


ఇంటర్నెట్‌ డెస్క్‌: మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) యూజర్‌ అనుమతి లేకుండా మొబైల్‌ఫోన్‌లోని మైక్రోఫోన్‌ (Microphone)ను ఉపయోగిస్తుందని కొద్ది రోజుల క్రితం పలువురు టెక్‌ నిపుణులు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను వాట్సాప్‌ ఖండించింది. ఆండ్రాయిడ్‌ (Android)లోని బగ్‌ కారణంగా మైక్‌ సింబల్‌ కనిపిస్తుందని తెలిపింది. గూగుల్ (Google) సైతం ఆ బగ్‌ను సరిచేస్తామని ప్రకటించింది. అయితే, ఇలాంటి ఆరోపణలు ఇదే మొదటిసారి కాదు. గతంలో అమెజాన్‌ (Amazon) కూడా ఈకో స్పీకర్ల ద్వారా వాయిస్‌ అసిస్టెంట్ అలెక్సా (Alexa) సాయంతో యూజర్ల మాటలు వింటుందనే ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో వాటిని అమెజాన్‌ కొట్టిపారేసింది. 


కేవలం వాట్సాప్‌, అమెజాన్‌ మాత్రమే కాదు.. మొబైల్‌ ఫోన్లలో ఉండే యాప్‌లలో చాలా వరకు యూజర్‌ మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుంటాయి. కొన్ని యాప్‌లకు మైక్రోఫోన్‌ వినియోగం తప్పనిసరి. మరి, ఫోన్‌ (Mobilephone)లో ఉండే యాప్‌లలో (Apps) ఏవైనా మీ అనుమతి లేకుండా.. మైక్రోఫోన్ ఉపయోగిస్తున్నాయని అనుమానమా? అలాంటి వాటిని ఎలా గుర్తించాలి? యాప్‌లు మైక్రోఫోన్‌ ఉపయోగించకుండా ఏం చేయాలో చూద్దాం.


    ఫోన్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ (Apps) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో ప్రతి యాప్‌పై క్లిక్‌ చేసి పర్మిషన్‌ సెక్షన్‌లోకి వెళితే.. అలౌడ్‌ (Allowed), నాట్‌ అలౌడ్‌ (Not Allowed) అని రెండు ఆప్షన్లు ఉంటాయి. అలౌడ్‌ సెక్షన్‌లో మైక్రోఫోన్‌ సింబల్‌ ఉంటే ఆ యాప్‌ దాన్ని ఉపయోగిస్తున్నట్లు భావించాలి. ఒకవేళ నాట్‌ అలౌడ్‌ సెక్షన్‌లో మైక్రోఫోన్ సింబల్‌ కనిపిస్తే యాప్‌ దాన్ని ఉపయోగిచడంలేదని అర్థం.

    ఏదైనా యాప్‌కు మైక్రోఫోన్ అనుమతి ఇవ్వకూడదనుకుంటే దానిపై క్లిక్‌ చేసి డోంట్‌ అలౌ (Don't Allow) ఆప్షన్‌ సెలక్ట్‌ చేస్తే సరిపోతుంది. కొన్ని యాప్‌లు వినియోగించేందుకు మైక్రోఫోన్‌ అనుమతి తప్పనిసరి. అలాంటి వాటికి వైల్‌ యుజింగ్‌ ది యాప్‌ (While Using The App) ఆప్షన్‌ సెలెక్ట్ చేయాలి. అలాకాకుండా మైక్రోఫోన్‌ ఉపయోగించే ముందు మీ అనుమతి కోరాలంటే ఆస్క్‌ మీ ఎవ్రీటైమ్‌ ( Ask Me Everytime) ఆప్షన్ ఎంచుకోవాలి.

    అలానే మరికొన్ని యాప్‌లకు మైక్రోఫోన్‌ అనుమతి అవసరం ఉండదు. కానీ, ఫోన్‌ యాప్‌ ఇన్‌స్టాల్ చేసే సమయంలో కెమెరా, లొకేషన్‌, మైక్రోఫోన్ వంటి వాటి అనుమతి తప్పనిసరి చేస్తాయి. అలాంటప్పుడు, యాప్‌ ఇన్‌స్టాల్ చేసేప్పుడు అనమతించి, తర్వాత యాప్‌ పర్మిషన్‌లోకి వెళ్లి కెమెరా, మైక్రోఫోన్, లొకేషన్‌ వంటి ఆప్షన్లను డిసేబుల్ చేయొచ్చు.

    కొన్నిసార్లు యాప్‌లను ఉపయోగించకపోయినా.. ఫోన్‌ పైభాగంలో మీకు ఆకుపచ్చ రంగులో మైక్రోఫోన్ సింబల్‌ కనిపిస్తే.. అనుమతి లేకుండానే మీ ఫోన్‌లోని యాప్‌లు మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తున్నాయని అర్థం. అలానే, ఏ యాప్‌ ఎప్పుడెప్పుడు మైక్రోఫోన్‌ ఉపయోగించాయనేది తెలుసుకోవచ్చు.

    ఇందుకోసం సెట్టింగ్స్‌లో యాప్స్‌ సెక్షన్‌లోకి వెళ్లి ప్రైవసీ అండ్‌ సెక్యూరిటీ సెక్షన్‌ ఓపెన్‌ చేయాలి. అందులో మైక్రోఫోన్‌ సింబల్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే.. మీ ఫోన్‌ మైక్రోఫోన్‌ను ఏ యాప్‌ ఎంతసేపు ఉపయోగించాయనే సమాచారం కనిపిస్తుంది. దాంతోపాటు మీ ఫోన్‌లో కెమెరా, లొకేషన్‌ వంటి వాటిని ఏయే యాప్‌లు ఉపయోగించారనేది కూడా తెలుసుకోవచ్చు.