Dr Samala Sadashiva life story || About సామల సదాశివ గురించి

 


సామల సదాశివ

జన్మ స్థలం:- కొమురంభీము జిల్లా కాగజు నగరం ప్రాంతంలోని తెనుగుపల్లె

(11-05-1928 – 07-08-2012)

 తెలుగు వారికి ఉర్దూ భాష మాధుర్యాన్ని రుచిచూపిన వారిలో అగ్రగణ్యులు డా, సామల సదాశివ మాస్టారు. ఆదివాసుల జిల్లా, అడువుల జిల్లా అని పేరు వడసిన ఆదిలాబాదు జిల్లాకు సదాశివ మాస్టారు జిల్లా అన్న ప్రాచుర్యం రావడానికి దశాబ్దాల ఆయన సాహిత్య కృషితోపాటు, పెద్దవారితో పిన్న వారితో వారేర్పరుచుకున్న సాన్నిహిత్య ప్రేమానురాగాలు కూడా కారణాలు.

 తన ప్రతిభ ప్రస్తావన రానీయకుండా ఎదుటి వారిలోని ప్రతిభా పాటవాలు పసి గట్టడంలో ప్రసిద్ధులు సదాశివ గారు. పనివారు, పసివారల నుండి పండితులు, ప్రతిభా వంతులదాకా తనకు పరిచయమైన వారిలోని, ప్రావీణ్యాలను మానవతా విలువలను, సౌజన్య సౌశీల్యాలను గుర్తించి పనిగట్టుకుని ముచ్చట్ల రూపంలో ప్రజావళికి పలు పత్రికల ద్వారా వెలువరించిన వితరణ శీలి సదాశివ.

 సదాశివ మాస్టారు పుట్టింది. ఒకప్పటి ఆదిలాబాదు ఇప్పటి కొమురంభీము జిల్లా కాగజు నగరం ప్రాంతంలోని తెనుగుపల్లె. అది అప్పటికీ పల్లెనే. తండ్రి నాగయ్య పంతులు బడి పంతులుగా పని చేసిన కాగజ్ నగర్ సమీపంలోని నవెగాంలో గడచింది. అది నైజాం జమానా, బళ్ళల్లో ఉర్దూ మీడియంలో బోధన జరిగేది. సారు కూడా ఉర్దూ మీడియంలోనే చదువుకున్నా తండ్రి నేర్పిన తెలుగుతో ఇంట్లో ఉన్న భారత భాగవతాలు చదివి తెలుగు భాష పై పట్టు చేజిక్కించుకున్నారు. అలాగే అరబ్బీ తెలిసిన గురువు దగ్గర అరబ్బీ నేర్చుకున్నారు.

 వరంగల్లులో మెట్రిక్ వరకు చదివి స్వంత జిల్లాలో ఉపాధ్యాయ వృత్తిలో చేరినారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సాహిత్య రంగంలో ప్రవేశించి పద్యాలు, కథలు, వ్యాసాలు రాసి పత్రికలకు పంపడం, పండిత ప్రకాందులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నెరపడంతో గుర్తింపదగిన స్థాయికి చేరుకోవడమే కాదు పలువురి ప్రశంసలకు పాత్రులైనారు. సదాశివ గారు తొలుత తన పద్యకృతి ప్రభాతము వెలువరించారు. ఆ పిదప సాంబశివ శతకము, నిరీక్షణము లఘు కావ్యములను వెలువరించారు. ఈ రెండింటికీ ముందుమాట వ్రాసిన కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు సదాశివ పద్య రచనను మనసారా కొనియాడారు.

 ఆ తరువాత మంచి మాటలు, ధర్మ వ్యాధుడు, విశ్వామిత్రము, అంబపాలి, వంటి పలు పద్య కృతులు రాసినారు. ఇవిగాక అమ్మద్ రుబాయీలు అందమైన తేటగీతల్లోకి తర్జుమా చేశారు. వీరి రుబాయీల అనువాదాలు చూసి మురిసిపోయిన వేలూరి శివరామ శాస్త్రి సదాశివలోని నిర్దుష్ట పద్య రచనా శైలిని, భావ గాంభీర్యాన్ని ప్రస్తుతించారు. ఒకవైపు తెలుగు రచనలు కొనసాగిస్తూనే మరోవైపు ఉర్దూ పత్రికలకు వ్యాసాలు రాస్తుండేవారు. ఈ తరుణంలోనే గోలకొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి గారు పద్య కవిత్వం పక్కకు పెట్టి పారసీ, అరబ్బీ, ఉర్దూ భాషలలోని విశేషాల గురించి రాయమని సూచించడంతో సదాశివ గారు వారి మాటకు విలువనిచ్చి తన దిశను మార్చుకున్నారు.

 ఇక అప్పటి నుంచి సదాశివ తన దృష్టినంతా ఉర్దూ అరబ్బీ ఫారసీ భాషా సాహిత్యాలవైపు మళ్ళించి ఫారసీ కవుల ప్రసక్తి, గాలిబు జీవిత చరిత్ర, ఉర్దు సాహిత్య చరిత్ర వంటి పుస్తకాలు ప్రచురించారు. గీటురాయి, మిసిమి పత్రికల్లో గజల్ రుబాయీ వంటి ప్రక్రియల గురించిన సాధికారిక వ్యాసాలు రాశారు. సియాసన్ పత్రిక ద్వారా తెలుగులోని ప్రసిద్ధ కవులను ఉర్దు వారికి పరిచయం చేసి ఇరు భాషల వారధియైనారు. సామల సదాశివ.

 ఇదంతా ఒక పార్శ్వమైతే సదాశివ సంగీతజ్ఞత ఆయనకు ఎందరో అభిమానులను సమకూర్చింది.

ఆదిలాబాదుకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాల ప్రభావం తెలంగాణ ప్రాంతంపై ఉన్నది. అది ఆదిలాబాదులో మరీ ఎక్కువ. తరచుగా హిందూస్తానీ కచేరీలు వినడం ఆ మాధుర్యానికి అలవాటుపడటంతో హిందూస్తానీ సంగీత గాయనీ గాయకులు, గాయన పద్ధతులు, ఘరానాలు మొదలైన విషయాలపై పట్టు సాధించారు. తనకు తెలిసిన విషయాలను, తాను అనుభవించిన ప్రతి రసరమ్య సన్నివేశాలను ముచ్చట్లుగా అటు పాఠకులకు, ఇటు తనను కలువడానికి వచ్చిన అభిమాన శ్రోతలకు చెబుతుండేవారు. అవును ఆయన రచనలు చదివే పాఠకులకు చదివినట్లుగా కాకుండా ఆయన చెబ చెబుతుంటే విన్నట్లుగా ఉండేవి. అదే వారి వచన రచనలోని విశేషం.

 బహుముఖ ప్రజ్ఞాశాలియైన సదాశివ అనేక ప్రక్రియల్లో పట్టు సాధించారు. వారు రాసిన కొన్ని కథలు అప్పట్లో సుజాత పత్రికలో ప్రచురించబడ్డాయి. వారు అపశ్రుతి, రేవతి అనే రెండు నవలలు కూడా రచించారు. మరాఠీ నుండి కేశవ సుత్ జీవిత కథ తెనిగించారు. పలు పుస్తకాలకు ముందు మాటలు రాసారు. నాటకాలకు సందర్భోచిత పద్యాలు రాసిచ్చారు. సదాశివ గారి జీవితంలో కాళోజీ సోదరుల మైత్రి ఒక ప్రధాన ఘట్టం. వారి గురించి ప్రస్తావించని ముచ్చట ఉండదు. తలచుకుని పరవశించని రోజు ఉండదు. అదొక అపూర్వ మైత్రీబంధం. పూర్వజన్మల బంధం. దానికి ఒక కారణం ఆ సోదరుల అన్యోన్య ప్రేమానుబంధం.

 ఉద్యోగం చేస్తూనే స్నాతకోత్తర విద్యను సాధించిన సదాశివ గారిని పదవులు, పురస్కారాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఉపాధ్యాయులుగా, పాఠశాలల తణిఖీ అధికారిగా, ఉపాధ్యాయ శిక్షణ సంస్థ లోధకుడిగా పనిచేసిన సదాశివ పదోన్నతి పై భద్రాచలం కళాశాల పరిని పాలుగా చేసి పదవీ విరమణ పొందారు. ఉరుదూ భాషాభిజ్ఞులుగా రెండు దశాబ్దాలు ఆం.ప్ర. సాహిత్య అకాడమీ ఉర్దూ సలహా సంఘం సభ్యులుగా, విణులుగా, మూడేళ్ళు కాకతీయ విశ్వవిద్యాలయ సెనేట్ మెంబరుగా గౌరవ పదవులలంకరించారు. వీరి అనువాదాలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పురస్కారాన్ని పొందారు. అలాగే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ప్రతిభా పురస్కారాన్ని గౌరవ డాక్టరేటును, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటును పొందారు. వీరి స్వరలయలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఇవికాక మరెన్నో సన్మాన సత్కారాలు జరిగినా అవన్నీ చంద్రునికో నూలు పోగు వంటివే. ఇటీవల వీరి రచనలపై పరిశోధనలు మొదలయ్యాయి.

 ఆకాశవాణిలో వీరు చేసిన ప్రసంగాలు ఎందరో రసజ్ఞులైన శ్రోతలనలరించాయి. తొణుకు బెణుకులేని వీరి కంఠస్వరం, సహజసుందరి శైలి, చిన్న చిన్న వాక్యాలతో వీరి ప్రసంగం శ్రోతల నలరించేదిగా ఉండేది. కరీంనగర్ విశ్వనాథ పీఠంవారు సదాశివ అభినందన సంచికగా ఏడువందలకు పైగా పేజీలుగల జయంతి సంచిక ఆదిలాబాదు ఆకాశవాణి కేంద్రంలో ఆవిష్కరణ జరిగినప్పుడు ఒక పండుగలా అనిపించటం అతిశయోక్తి కాదు. మాటలకందని మహనీయుల గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ వైతాళికులలో ఒకరయిన డా. సామల సదాశివ మాస్టారు 11 మే 1928న జన్మించి 7 ఆగస్టు 2012లో పరమపదించారు. భౌతికంగా లేకున్నా వారి స్ఫూర్తి చిరకాలం ఉంటుంది.


(సేకరణ:- తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన “తెలంగాణ తేజోమూర్తులు” గ్రంథం నుండి.)


“చనకే సువ్యాఖ్యనో యిది యెఱుంగ 

  ఎవరి దుస్తూరినో యిదియే నెఱుంగ 

  నేనుగలనొ, నాతెరనెవ్వడేని గలడొ

  వ్యక్తినో, లేక చిత్తరువనొ,యెఱుంగ"

 ఇలా సామల సదాశివ గారి మరెన్నో పద్యాలను, విశేషాలను ఈ క్రింది పుస్తకాలను చదవడం ద్వారా తెలుసుకోవచ్చు.

సామల సదాశివ రచనలు : 

అమ్జద్ రుబాయీలు, ప్రచురణ : తెలంగాణ సాహిత్య అకాడమి, వెల: రూ. 30/-

ఉర్దూ సాహిత్య చరిత్ర, ప్రచురణ: తెలంగాణ సాహిత్య అకాడమి, వెల: రూ. 130/-

సామల సదాశివ ఖండకావ్యాలు, ప్రచురణ: తెలంగాణ సాహిత్య అకాడమి, వెల: రూ. 30/-