భారత రాష్ట్రపతులు
1. బాబూ రాజేంద్ర ప్రసాద్(1950-62) :
బిహార్‌కు చెందిన ఈయన అత్యధిక కాలం రాష్ర్టపతిగా పనిచేశారు. రెండుసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. సుప్రీంకోర్టు సలహాను ఎక్కువసార్లు (3సార్లు) కోరిన రాష్ట్రపతి. ఆయన చేతిలో ఓడిపోయిన వారు.. ప్రొ. కె.టి. షా, జస్టిస్, ఎన్.ఎన్.దాస్. 1962లో భారతరత్న లభించింది.
2. సర్వేపల్లి రాధాకృష్ణన్(1962-67)
సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వరాష్ట్రం తమిళనాడు. ఈయన వివిధ యూనివర్సిటీలకు వీసీగా పనిచేశారు. రెండు యుద్ధాలను ఎదుర్కొన్న ఏకైక రాష్ట్రపతి. టెంపుల్టన్ అవార్డు గెలిచిన మొదటి భారతీయుడు. ఈయన జన్మదినమైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు.
3. జాకీర్ హుస్సేన్ (1967-69)
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. పదవిలో కొనసాగుతూ చనిపోయిన మొదటి రాష్ట్రపతి. అతి తక్కువకాలం రాష్ట్రపతిగా పని చేశారు. ఈయనకు 1963లో భారతరత్న అవార్డు లభించింది.
4. వి.వి.గిరి (1969-74)
ఆయన సొంత రాష్ట్రం ఒడిశా. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి రాష్ట్రపతిగా ఎన్నికైన వ్యక్తి. అతి తక్కువ మెజారిటీతో, ఓటు బదలాయింపు ద్వారా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఎన్నిక వివాదంలో స్వయంగా కోర్టుకు హాజరైన రాష్ట్రపతి. కార్మిక నేతగా ఉండి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
5. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ (1974-77)
అసోంకు చెందినవారు. పదవీకాలంలో చని పోయిన రెండో, చివరి రాష్ట్రపతి. అత్యధికంగా ఆర్డినెన్సులను జారీ చేసిన రాష్ట్రపతి. అత్యవసర సమయంలో కీలుబొమ్మ రాష్ట్రపతిగా పేరు గడించారు.
6. నీలం సంజీవరెడ్డి (1977-82)
ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. రాష్ట్రపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక వ్యక్తి. అతి చిన్న వయస్సులో రాష్ట్రపతి పదవిని చేపట్టారు. ముఖ్యమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా, కేంద్రమంత్రిగా పనిచేసిన అనంతరం రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
7. జ్ఞానీ జైల్‌సింగ్ (1982-87)
ఆయన రాష్ట్రం పంజాబ్. బలహీన వర్గాల నుంచి ఎన్నికైన మొదటి రాష్ట్రపతి. పాకెట్ వీటో అధికారాన్ని ఉపయోగించుకున్న ఏకైక రాష్ట్రపతి. ఈయన కాలంలోనే అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ‘ఆపరేషన్ బ్లూస్టార్’ నిర్వహించారు.
8. ఆర్.వెంకట్రామన్ (1987-92)
తమిళనాడుకు చెందినవారు. ఎక్కువ మంది ప్రధానమంత్రులతో పదవీ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి. సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు పునాదులు వేసినవారు.
9. డా.శంకర్ దయాళ్ శర్మ (1992-97)
మధ్యప్రదేశ్‌కు చెందినవారు. ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పనిచేసి రాష్ట్రపతి పదవికి ఎన్నికయ్యారు.
10. కె.ఆర్. నారాయణన్ (1997-2002)
కేరళకు చెందిన వ్యక్తి. ఏకైక దళిత రాష్ట్రపతి.
11. డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం (2002-2007)
ఈయన సొంత రాష్ట్రం తమిళనాడు. రాజకీయ నేపథ్యం లేకుండా రాష్ట్రపతి అయిన ఏకైక వ్యక్తి. భారత క్షిపణుల పితామహుడిగా ప్రసిద్ధి చెందారు. ఈయన రచించిన పుస్తకం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’. కలాం జన్మదినమైన అక్టోబర్ 15ను యూఎన్వో ‘ప్రపంచ విద్యార్థి దినోత్సవం’గా ప్రకటించింది.
12. ప్రతిభా దేవిసింగ్ పాటిల్ (2007-12)
సొంత రాష్ట్రం మహారాష్ట్ర. ఏకైక మహిళా రాష్ట్రపతి. గవర్నర్‌గా, రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా పనిచేసి రాష్ట్రపతి అయ్యారు. బ్రిటన్ రాణి ఆహ్వానం అందుకున్న ఏకైక రాష్ట్రపతి. వ్యక్తిగత ఖర్చులకు ప్రజాధనాన్ని ఎక్కువగా ఖర్చుపెట్టిన రాష్ట్రపతి.
13. ప్రణబ్ ముఖర్జీ (2012 నుంచి 2017 వరకు)
సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్. కేంద్ర పరిశ్రమల, వాణిజ్య, విదేశాంగ, రక్షణ, ఆర్థిక మంత్రిగా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా పనిచేసి రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.
14. రామ్ నాథ్ కోవింద్ (2017 నుంచి..)
ఉత్తరప్రదేశ్ నుంచి భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన మొదటి వ్యక్తి. ఆయన అధ్యక్ష పదవికి ముందు, అతను 2015 నుంచి 2017 వరకు బీహార్ 26వ గవర్నర్‌గా పనిచేశాడు, 1994 నుంచి 2006 వరకు పార్లమెంటు, రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు. రాజకీయాల్లోకి రాకముందు, అతను 16 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశాడు.
15. ఆదివాసీ తనయ.. భరతమాత ముద్దుబిడ్డ
ప్రతి అడుగులో పోరాటం..
కష్టాలు, కన్నీళ్లను అధిగమిస్తూ ముందుకుసాగిన జీవిత ప్రస్థానం
భారత రాష్ట్రపతిగా చరిత్ర సృష్టించిన ద్రౌపదీ ముర్ము
భువనేశ్వర్,
ఆదివాసీ తనయ.. భరతమాత ముద్దుబిడ్డ
మారుమూల అటవీ ప్రాంతంలో విరబూసిన జాజిమల్లె ఆమె. ఆ పరిమళాలు కొండలు, కోనలు దాటుకుంటూ దేశ రాజధానికి చేరుకుని చరిత్ర సృష్టించాయి. భారత దేశ ప్రథమ పౌరురాలిగా హస్తినలో కొలువుదీరేలా చేశాయి. దేశాధినేతగా ఎన్నికైన ఆమె విజయ గాథ వెనుక ఎన్నో కోణాలు! కష్టాలు, కన్నీళ్లు, త్యాగాలు, సేవానిరతి, దేశభక్తి, దృఢ సంకల్పం..అన్ని మానవీయ సౌరభాలను ఒక్కచోటుకు చేర్చితే ఆమే ద్రౌపదీ ముర్ము... మన నూతన రాష్ట్రపతి.
ద్రౌపదీ ముర్ము జీవితం చీకటి, వెలుగుల ప్రస్థానం. గిరిజన జాతుల్లో గుర్తింపు లేని సంతాళీ తెగలో జన్మించిన ఆమె.. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక పెద్ద పోరాటమే ఉంది. పేదరికం, వెనుకబాటుతనం మధ్య పెరిగిన ముర్ము ఏ దశలోనూ వెనకడుగు వేయలేదు. ఒడుదొడుకులకు తట్టుకుని నిలబడ్డారు. సమున్నత వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకున్నారు.
సచివాలయంలో చిరుద్యోగిగా..
ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా కుసుమి సమితి ఉపరబెడలోని సంతాళీ తెగలో 1958 జూన్ 20న జన్మించారు. తండ్రి బిరించి నారాయణ టుడు గ్రామ పెద్దగా ఉండేవారు. పేదరికం అవరోధంగా నిలిచినా చదువుకోవడం కోసం పరితపించారు. ప్రాథమిక విద్య పూర్తి చేసిన ముర్ముకు ఆ తర్వాత చదువును కొనసాగించేందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉన్నత విద్య కోసం భూమిని విక్రయించి భువనేశ్వర్ పంపించారు. ప్లస్‌టు, రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి, సచివాలయం (లోక్‌సేవా భవన్)లో చిరుద్యోగిగా ఆమె చేరారు. తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలి స్వగ్రామంలో తాను ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలలోనే ఉపాధ్యాయురాలిగా చేరారు.
భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయి..
పాఠశాలలో పని చేస్తున్న సమయంలోనే మయూర్భంజ్ జిల్లా పహాడపుర్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి శ్యామచరణ్ ముర్మును వివాహం చేసుకున్నారు. ఇంటికే పరిమితమైన ద్రౌపదీ ముర్ము ఇద్దరు కూమారులు, ఒక కుమార్తె సంరక్షణ చూసుకుంటూ గిరిజనాభివృద్ధి ధ్యేయంగా సామాజిక సేవ చేసేవారు. కొన్నేళ్లకు కుటుంబ సమేతంగా రాయ్‌రంగ్‌పుర్ వచ్చి స్థిరపడ్డారు. క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడే పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొన్నేళ్ల వ్యవధిలోనే చిన్న కుమారుడు, మరో ఏడాదిలో భర్త చనిపోవడం ఆమెను కుంగదీశాయి. 2009-2015 మధ్య ఆరేళ్ల సమయంలో ఈ విషాద ఘటనలన్నీ ఆమెను చుట్టుముట్టాయి. ఈ దుఃఖం నుంచి బయటకు రావడానికి ఆమెకు చాలా ఏళ్లే పట్టింది.
కౌన్సిలర్‌గా ఎన్నిక..
ఆదివాసీల అభివృద్ధికి పాటుపడుతూ.. సమాజసేవలో తలమునకలై ఉన్న ద్రౌపదీ ముర్ము... స్నేహితులు, సన్నిహితుల ప్రోత్సాహంతో 1997లో రాజకీయ అరంగేట్రం చేశారు. నగర పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. తరువాత పురాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ముర్ము అంచెలంచెలుగా ఎదుగుతూ 2000లో రాయ్‌రంగపుర్ నుంచి భాజపా ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు బిజు జనతా దళ్, భాజపా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ముర్ముకు రవాణా, వాణిజ్య, మత్స్య, పాడి శాఖల మంత్రిగా అవకాశం దక్కింది.
విషాదం నుంచి కోలుకుని
భర్త, ఇద్దరు కుమారులను కోల్పోయిన ద్రౌపదీ ముర్ము ఆ విషాదం నుంచి బయటపడడానికి బ్రహ్మకుమారి ఈశ్వరీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. గ్రామంలో ఆలయాలకు వెళ్లి ప్రాంగణాన్ని చీపురుతో ఊడ్చేవారు. తాజా విజయంతో.. స్వాతంత్య్రానంతరం జన్మించి భారత రాష్ట్రపతి అవుతున్న తొలి మహిళగా కూడా ద్రౌపది నిలిచిపోనున్నారు.
భర్త పేరిట పాఠశాల
గిరిజన చిన్నారులు చదువుకోవాలన్న ఉద్దేశంతో పహాడ్పుర్లో భర్తపేరిట పాఠశాల ఏర్పాటు చేసి, ఉచిత బోధన అందిస్తున్నారు. భర్త, ఇద్దరు కుమారుల పేరిట ఉన్న ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన కుమార్తె ఇతిశ్రీ దీనికి సహకారం అందిస్తున్నారు.
చద్దన్నం అంటే ప్రీతి
ద్రౌపదీ ముర్ము నిరాడంబరంగా జీవించేవారని ఉపరబెడలోని బంధువులు వెల్లడించారు. చద్దన్నం చాలా ఇష్టంగా తినేవారని తెలిపారు. ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి, కష్టసుఖాలు తెలుసుకునేవారన్నారు. పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలని సూచించే వారని, గ్రామంలో ఉన్నన్ని రోజులు సామాన్యులతో కలిసిపోయేవారని గుర్తు చేసుకున్నారు.
జీవిత విశేషాలు
పుట్టిన తేదీ: 20.06.1958
జన్మస్థలం: ఉపరబెడ గ్రామం, ఒడిశా
విద్య: రాజనీతి శాస్త్రంలో డిగ్రీ
రాజకీయ ప్రస్థానం
1997: రాయ్‌రంగపుర్ కౌన్సిలర్‌గా ఎన్నిక
2000-2009: రాయ్‌రంగపుర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు భాజపా ఎమ్మెల్యేగా విజయం
2000-2004: నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రి
2006-2009: ఒడిశాలో భాజపా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలు
2007: ఒడిశా అసెంబ్లీలో ఉత్తమ ఎమ్మెల్యే (నీలకంఠ సన్మాన్) పురస్కారం
2015-2021: ఝార్ఖండ్ గవర్నర్
2022 జూన్ 21: భారత రాష్ట్రపతిగా ఎన్నిక